
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ములుగు రూరల్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ములుగు సెక్టార్ సీడీపీఓ శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన పోషణమాసం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ టీచర్లు తయారు చేసిన ఆహార పధార్ధాలను ప్రదర్శించారు. పౌష్టికాహార లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల తగ్గుతుందని, మహిళల్లో రక్తహీనత సమస్యలు తలెత్తుతాయని వివరించారు. బాలింతలకు ముర్రుపాల ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం పూలతో బతుకమ్మలు పేర్చి ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ములుగు సెక్టార్ సూపర్‌వైజర్ కావ్య, డీసీ మమత, ములుగు బ్లాక్ కో ఆర్డినేటర్ వెంకటరాజు, ప్రాజెక్టు సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
సీడీపీఓ శిరీష