
అద్దె డబ్బులు అందేనా?
● అద్దె ఇళ్లలో అంగన్‌వాడీ కేంద్రాల
కొనసాగింపు
● పెండింగ్‌లో 6 నెలల బిల్లులు
● సొంతంగా డబ్బులు చెల్లిస్తున్న టీచర్లు
ములుగు రూరల్: జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో సెంటర్ల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. అద్దె భవనాల వద్ద అరకొర వసతుల నడుమ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. జిల్లాలోని పది మండలాల పరిధిలో ములుగు, ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 640 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 153 కేంద్రాలు అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల బిల్లులు ప్రభుత్వం నుంచి సకాలంలో రాకపోవడంతో టీచర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మిగితావి 276 సొంత భవనాల్లో, 211 ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి.
అద్దె నిబంధనలు ఇలా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె చెల్లింపునకు శానిటేషన్, నీటి సదుపాయం, 500 గజాల స్థలం కలిగి ఉండాలి. రెండు గదులతో పాటు కిచెన్ రూం వేరుగా ఉండాలి. నిబంధనల మేరకు అద్దె ఇళ్లు దొరకక పలు సెంటర్లు అరకొర వసతుల మధ్య కొనసాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. నెల వారీగా అండన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బియ్యం, కోడిగుడ్లు, చిన్నారుల ఆట వస్తువులను భద్రపరచడం కూడా కష్టతరంగా మారుతుంది. పట్టణ ప్రాంతంలో అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.1,000 నెల వారీ అద్దె చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 750 చెల్లిస్తారు.
ఆరు నెలల అద్దె బిల్లు పెండింగ్
జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు గత ఏడు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లు ఇంటి యజమానులకు సమాధానం చేప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు టీచర్లు చేసేదేమీ లేక సొంత డబ్బుల నుంచి అద్దె చెల్లిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి..
అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతినెలా అద్దెకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తున్నాం. ఫిబ్రవరి–2025 వరకు అద్దె బిల్లులు చెల్లించాం. మిగతా ఆరు నెలల అద్దెకు సంబంధించిన బడ్జెట్ రాలేదు. బడ్జెట్ వచ్చిన వెంటనే అద్దె బిల్లులను చెల్లిస్తాం.
–తుల రవి, జిల్లా సంక్షేమ అధికారి
ప్రాజెక్టులు సొంత అద్దె ప్రభుత్వ
భవనాలు భవనాలు భవనాలు
ములుగు 26 52 64
ఎస్‌ఎస్ తాడ్వాయి 58 27 39
ఏటూరునాగారం 100 40 66
వెంకటాపురం(కె) 92 34 42

అద్దె డబ్బులు అందేనా?

అద్దె డబ్బులు అందేనా?