
చెప్పినా వినరు.. నిషేధించినా ఆగరు
వాజేడు: జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనను నిలిపివేసినా.. చెప్పాపెట్టకుండా, అధికారుల కళ్లుగప్పి దొడ్డిదారిన పలువురు పర్యాటకులు వెళ్తున్నారు. రక్షణ లేని జలపాతాలను చూస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పర్యాటకులకు ఎంత చెప్పినా.. ఏర్పాట్లు కట్టుదిట్ట చేసినా వెళ్లడం మాత్రం మానడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం మండల పరిధిలోని కొంగాల సమీపంలోని గుట్టల్లో ఉన్న దూసపాటి లొద్ది జలపాతాన్ని చూసేందుకు హైదరాబాద్‌కు చెందిన కొండిశెట్టి మహాశ్విన్(18) తన మిత్రులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి గల్లంతయ్యాడు. మంగళవారం జీపీ సిబ్బంది అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టగా మృతదేహం బయటపడింది.
నిషేధిత జలపాతాల వద్దకు వెళ్లొద్దు
జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ముత్యంధార, మాసన్ లొద్ది, భామన సిరి, గుండం, దూసపాటి లొద్ది మొదలైన జలపాతాల సందర్శనను వెళ్లవద్దని కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వర్షాకాలం ప్రారంభంలోనే అధికారికంగా ప్రకటించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతాలు ఉండడంతో ఫోన్ సిగ్నల్స్‌తో పాటు రక్షణ సౌకర్యాలు లేనందున సందర్శన నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా చెక్ పోస్టులు సైతం ఏర్పాటు చేశారు. కాని కొందరు పర్యాటకులు సిబ్బంది విధులకు రాని సమయం కంటే ముందే, మరికొందరు దొంగదారుల్లో జలపాతాల వద్దకు వెళ్లి వస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో ముత్యంధార జలపాతానికి వెళ్లిన కొందరు పర్యాటకులు వెళ్లి ఒక్కరు తప్పిపోవడంతో అధికారులు రాత్రంతా గాలించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన మరచిపోకముందే దూసపాటి లొద్దికి వెళ్లిన యువకుడు మృత్యువాత పడడం విషాదకరంగా మారింది. తమపైన ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న తల్లిదండ్రులను గుర్తుంచుకుని నిషేధిత జలపాతాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పర్యాటక సురక్షిత ప్రాంతాలైన బొగత, రామప్ప, లక్నవరం వంటి సుందర ప్రదేశాలకు వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు.
దొంగచాటున నిషేధిత
జలపాతాల సందర్శన
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పలువురు పర్యాటకులు