
కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేయాలి
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ వసతి, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ల కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా వర్కర్లకు టైం స్కేల్ చేయాలని సీఐటీయూ నాయకులు దావూద్, రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు మంగళవారం ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని మేడారం ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌కు వచ్చిన గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డిలను కలిసి కార్మికులు, నాయకులు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కేవలం రూ.15,600లు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. కాంట్రాక్టర్ కమిషన్, జీఎస్టీ కలిపి రూ.21వేలు అవుతుందని వీటిని ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి చెల్లిస్తుందని వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 20 మంది వర్కర్లకు టైం స్కేల్ ప్రకారం రూ.19వేలు వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. దానిప్రకారం ఇక్కడ కూడా అప్‌గ్రేడ్ చేయాలని విన్నవించినట్లు వివరించారు. అలాగే వర్కర్లకు రెండు జతల బట్టలు, వారంతపు సెలవులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, కమల, నాగమణి, సరోజన, లలిత, సారబాబు, శాంతమ్మ, రాజమ్మలతో పాటు 140 మంది వర్కర్లు పాల్గొన్నారు.
సీఐటీయూ నాయకులు దావూద్, రాజేందర్