
స్థానికంపై సందిగ్ధం..
హైకోర్టు గడువు
మరో వారం రోజులే..
మండలాల వారీగా ఓటరు జాబితా
రాజకీయ పార్టీల్లో గందరగోళం..
వెంకటాపురం(ఎం): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీ లోగా నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. మరో వారం రోజులే గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీ య పార్టీల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉండేనా.. మళ్లీ వాయిదా పడేనా అని రాజకీయ పార్టీల నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు.
జిల్లా యంత్రాంగం సన్నద్ధం
ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధమై ఉంది. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను కూడా అధికారులు ప్రకటించారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులు, ఇతర సామగ్రి సైతం సిద్ధం చేశారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు, 10 జెడ్పీటీసీలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,29,159 మంది ఓటర్ల కోసం 1,436 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 2న తుది జాబితాను ప్రకటించింది. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆధారంగా తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమేనని అధికారులు పేర్కొంటున్నారు.
వారం రోజులే గడువు
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు హామీనిచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పినప్పటికీ గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్‌లో ఉండడంతో పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటర్ల, పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటించి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ఫైల్ పెండింగ్ ఉందని, ఎన్నికల కోసం మరింత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రిజర్వేషన్లపై ఎటూ తేల్చని ప్రభుత్వం
ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేసిన అధికారులు
మండలం జీపీలు వార్డులు ఓటర్లు ఎంపీటీసీలు
వెంకటాపురం(ఎం) 23 200 28,236 9
ఏటూరునాగారం 12 114 24,636 9
గోవిందరావుపేట 18 154 25,441 9
కన్నాయిగూడెం 11 90 9,992 5
మల్లంపల్లి 10 90 13,507 5
మంగపేట 25 230 39,369 14
ములుగు 19 172 24,985 9
ఎస్‌ఎస్ తాడ్వాయి 18 152 18,226 7
వెంకటాపురం(కె) 18 166 25,336 9
వాజేడు 17 152 19,431 7
ప్రభుత్వం ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయ పార్టీల నేతల్లో గందరగోళం నెలకొంది. గ్రామాల్లో ఆశావహులు ఎన్నికల కోసం ముందస్తు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ షెడ్యూల్ విడుదల కాకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలంటే షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా లేక కోర్టు ద్వారా గడువు కోరుతుందా అనేది స్పష్టత లేకపోవడంతో అధికార పార్టీ నేతలు సైతం ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని పేర్కొంటున్నారు.