8,968 రేషన్ కార్డులు
పోరాట యోధుల త్యాగాలు మరువలేనివి
జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి సీతక్క పక్కన కలెక్టర్ దివాకర,
ఎస్పీ శబరీశ్
ములుగు రూరల్: రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్‌లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు.
ఆరోగ్యశ్రీ పథకం రూ.10లక్షలకు పెంపు
1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఎంతో విశిష్టత ఉందన్నారు. 77 సంవత్సరాల క్రితం రాచరిక పాలనకు విముక్తి పలికారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడంలో మహనీయులు, పోరాటయోధుల త్యాగాలు మరువలేనివని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను స్వీకరించి 48 గంటల్లో అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.40 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడంతో రూ. 89.34 లక్షలు మహిళలకు ఆదాయం చేకూరుతుందన్నారు. నిరుపేదలు కార్పొరేట్ వైద్యం పొందడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో గుండె, న్యూరాలజీ, ఆర్థోపెటిక్, పీడీయాట్రిషన్, జనరల్ సర్జరీలో 3,501 మందికి గాను రూ. 9కోట్ల 25లక్షల 67 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఇంటింటి జ్వర సర్వే..
వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500లకు వంట గ్యాస్ జిల్లాలో 50 వేల 98 మంది లబ్ధిదారులకు రూ. 4కోట్ల 38లక్షల 53 వేల సబ్సిడీ చెల్లించామని వివరించారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం
ప్రతీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళలు వ్యాపార రంగాలలో అభివృద్ధి చెందేవిధంగా ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలకు ఆసక్తి కలిగిన రంగాలలో నైపుణ్య శిక్షణ అందించి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రామప్ప రీజియన్ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా రూ. 37.10 కోట్లతో ఇంచర్ల గ్రామంలో టూరిస్టు ఎత్నిక్ విలేజ్ పనులు, రామప్ప ఐలాండ్ వద్ద రూ. 13 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు.
ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు
జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంచర్ల శివారులో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు ఉంటాయని వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారని, వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 39 ఇళ్లకు ఆర్ధిక సాయంగా రూ.1.45లక్షలు బాధితుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, పార్లమెంట్ సభ్యులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పదేళ్ల నుంచి రేషన్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి జిల్లాలో 8,968 మందికి రేషన్ కార్డులు అందించామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామని వివరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంగన్ వాడీలలో ప్రీప్రైమరీ తరగతులు, ప్రాథమిక విద్య నుంచి విశ్వ విద్యాలయాల వరకు మెరుగైన విద్యను అందిస్తున్నామని వ్యాఖ్యానించారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు
ప్రజాపాలన దినోత్సవంలో
మంత్రి సీతక్క
పేదల సంక్షేమమే ధ్యేయం
పేదల సంక్షేమమే ధ్యేయం
పేదల సంక్షేమమే ధ్యేయం