
స్వచ్చతాహీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క
ములుగు/ములుగు రూరల్: గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ దివాకరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతాహీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో దోమలు వృద్ధి చెందవని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, మహిళా సంఘాల ద్వారా రంగోలి వ్యాసరచన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆర్‌అండ్‌బీ, పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నూతన పనులు, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. గిరిజన భవన్‌లో కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాసోత్సవం కార్యక్రమాన్ని, ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ దివాకరతో కలిసి సందర్శించి మాట్లాడారు. వచ్చేనెల 16వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో స్వస్తినారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం, రాష్ట్రం, దేశ బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, డీపీఓ దేవరాజ్, డీఆర్‌డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.