
‘డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి’
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, గిరిజన సంఘం జిల్లా నాయకులు కోరం చిరంజీవి అన్నారు. జీఓ నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బుధవారం వారు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీవేజ్ కార్మికులు ఆరు రోజులుగా సమ్మె చేస్తుంటే ఒకవైపు హాస్టళ్లలో విద్యార్థులు వంటలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యను పరిష్కరించడం లేదన్నారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల వేతనాలను కలెక్టర్ గెజిట్ ఆధారంగా చెల్లించే విధంగా ట్రెజరీలకు మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. అర్హులైన డైలీవేజ్ వర్కర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని, అందరికీ టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు. అలాగే రూ.10 లక్షల ప్రమాద బీమా, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, మరణిస్తే రూ.50వేలు దహన సంస్కారాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లాజర్, గిరిజన సంఘం నాయకులు మధు, హాస్టల్ వర్కర్లు నాగలక్ష్మి, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, కమల, రాజు, యాకలక్ష్మి, స్రవంతి, రాజమ్మ, సమ్మక్క, వసంత, మాణిక్యం, శారద, భారతి, పద్మ, లచ్చిరాం, సత్యం పాల్గొన్నారు.