
సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి
ములుగు రూరల్: రైతులు పంటల సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ అన్నారు. మండల పరిధిలోని బండారుపల్లి, చిన్నగుంటూర్‌పల్లి ప్రాంతాలలో వరి, పత్తి పంటలను శాస్త్రవేత్తలు శ్రవణ్‌కుమార్, మానస, మాధవి, సౌందర్యలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో బ్యాక్టీరియా, ఎండాకుల తెగులు, ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు ఆశించడాన్ని గమనించాలన్నారు. ఉల్లికోడు నివారణకు వరి నాటిన 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు చల్లుకోవాలని సూచించారు. లేదా లీటర్ నీటికి 2.5 ఎంఎల్ పెట్రోల్‌ను పిచికారీ చేయాలన్నారు. కాండంతొలుచు పురుగు నివారణకు పంట పిలక దశలో నాటిన 20 నుంచి 25 రోజుల్లో ఎకరానికి 10 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు లేదా నాలుగు కిలోల క్లోరంట్రినిలిప్రోల్ గుళికలు చల్లుకోవాలని సూచించారు. లేదా కార్‌టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని వివరించారు. ఎండాకుల తెగులు నివారణకు అగ్రిమైన్‌సీన్ 0.4 గ్రాములు లేదా ప్లాంటామౌసిన్ 0.2 గ్రాములు లేదా కపర్ ఆక్లిక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని వెల్లడించారు. పత్తిలో రసం పీల్చు పురుగు, పచ్చదోమ నివారణకు పిప్రోనిల్ 2 ఎంఎల్, మోనోక్రోటోపాస్ 1.6 ఎంఎల్, ఎసిపేట్ 1.5 గ్రాములు లేదా థయోమితగ్జామ్ 0.2 గ్రాములు లేదా ప్లానికామిడ్ 0.7 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, ఏఈఓలు హరీశ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం
శాస్త్రవేత్త కృష్ణ