
సేవలు అందట్లే..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో మూడేళ్లుగా అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో గర్భిణులు, పిల్లలు, బాలింతలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇన్‌చార్జ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు ప్రాజెక్టులు..
జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్ అంగన్‌వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 644 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 40 టీచర్, 120 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయడం లేదు. పదవీ విరమణ పొందిన వారితో పాటు విధుల్లో మరణించిన వారితో ఖాళీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి.
టీచర్లు, హెల్పర్లది కీలక పాత్ర...
ఐసీడీఎస్ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పలు రకాల సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. బూత్ లెవెల్ అధికారులుగా ఎన్నికల విధుల్లో సేవలు అందిస్తున్నారు. ఖాళీలు భర్తీ అయితే వీరికి పనిభారం తగ్గడంతోపాటు, కేంద్రాల్లో మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం
అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల ఖాళీలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఖాళీలు ఉన్న కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించాం. ఎప్పటికప్పుడు సీడీపీఓలు, సూపర్‌వైజర్లు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– మల్లీశ్వరి, ఇన్‌చార్జ్ జిల్లా సంక్షేమాధికారి
మూడేళ్లుగా భర్తీకాని టీచర్, ఆయా పోస్టులు
అంగన్‌వాడీల్లో ఇన్‌చార్జ్‌లతో కార్యకలాపాలు
ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, పిల్లలు, బాలింతలు

సేవలు అందట్లే..

సేవలు అందట్లే..