
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: జిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి మదనపల్లి వరకు రూ.4 కోట్లతో విస్తరించనున్న రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మహిళా శక్తి పథకం ద్వారా ఇద్దరు మహిళలకు రూ.10లక్షల విలువ చేసే మొబైల్ ఫిష్ ఔట్లేట్ వాహనాలను మంత్రి సీతక్క అందజేశారు. ఈక పద్మ, కట్ల శిరీషలకు 60శాతం సబ్సిడీపై వాహనాలను అందించారు. వీహబ్ ఆధ్వర్యంలో ర్యాంప్ ఉమెన్ ఆక్సెలేరేషన్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషన్ సంపత్, జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్‌రాజ్, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, వీహబ్ సీఈఓ సీత, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆసోసిఝెట్ డైరెక్టర్ ఊహా, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, కోఆర్డినేటర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని సింగరకుంటపల్లి పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు, నర్సాపూర్‌లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40లక్షలు, నారాయణగిరిపల్లి అంగన్‌వాడీ భవన నిర్మాణానికి రూ.12లక్షలు, నారాయణగిరిపల్లెలో రూ.45లక్షలతో నిర్మించనున్న అంతర్గత రోడ్ల పనులకు కలెక్టర్‌తో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన 495 కుటుంబాలకు, గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టునగర్‌లో 149 కుటుంబాలకు యునైటెడ్ వే, ఇన్ఫోసెస్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పంటనష్ట పరిహారంపై సానుకూలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం రైతుల పంటనష్ట పరిహారంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. మంగళవారం మేడారానికి వచ్చిన మంత్రి సీతక్కను పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చర్పా రవీందర్‌ల ఆధ్వర్యంలో మేడారం ప్రాంతంలోని రైతులు పంట నష్టపరిహారం ఇప్పించాలని మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. జాతర సమయంలో భక్తుల వాహనాలు పార్కింగ్ కోసం 1500 ఎకరాలు నష్ట పోతున్నారని సీతక్కకు వివరించగా పరిహారం ఇప్పించేందుకు వెంటనే సర్వే నిర్వహించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముజఫర్, నాయకులు పీరీల వెంకన్న, జంగా వెంకటేశ్, వీరమోహన్ రావు, రాజయ్య, బాపురెడ్డి, పోడెం బాబు రైతులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క

రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి