
వనాల జిల్లాకు వన్నె తెచ్చేలా..
ములుగు జిల్లాలోని 171 గ్రామ పంచాయతీ నర్సరీల్లో 11,59,193 మొక్కలు పెంచుతున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ నర్సరీలో 6 వేల మొక్కల చొప్పున పెంచారు. దీంతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో మూడు నర్సరీల్లో 2.15 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇందులో 1,00,793 మొక్కలను గతంలో నాటిన వాటి స్థానంలో నాటనున్నారు. నర్సరీల్లో నీడనిచ్చె చెట్లతో పాటు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నీడనిచ్చే మొక్కలు కానుగ, ఎర్రతొగరు, నారేప, రావి, మర్రి, జువ్వి, ఇప్ప, వెదురు చెట్టు, పండ్ల మొక్కలు జామ, మామిడి, నిమ్మ, పనస, పూల మొక్కలు మందార, మల్లె, గులాబీ మొక్కలను పెంచుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పండ్ల, పూల మొక్కల్ని పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు.
అడవుల ఖిల్లా.. ములుగు జిల్లాకు మరింత వన్నె తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వన మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 14.16 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు టార్గెట్ విధించారు. ఆయా నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వర్షాలు కురవగానే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– ములుగు రూరల్
విస్తారంగా అడవులున్పటికీ ములుగు జిల్లాలో అదే స్థాయిలో చెట్ల నరికివేత ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న అడవుల్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మరికొద్ది రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఇప్పటి వరకు నాటిన మొక్కలు
ములుగు జిల్లాలో 2022 నుంచి 2024–25 వరకు మొత్తం 14,39,967 మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఇందులో 14,00,967 మొక్కలు సమృద్ధిగా పెరిగాయని డీఆర్డీఏ అధికారులు తెలిపారు. మొక్కల సంరక్షణకు 10.17 కోట్లు వెచ్చించారు. ఈఏడాది వివిధ శాఖల ద్వారా జిల్లాలో టార్గెట్ 14,00,165 మొక్కలు నాటనున్నారు.
జిల్లాలోని మండలాలు 10
జనాభా 2,94,671
జిల్లా విస్తీర్ణం
3,881 స్క్వేర్ కిలోమీటర్లు
జిల్లాలో అటవీ విస్తీర్ణం 2,00,835 హెక్టార్లు
మల్లంపల్లి పరిధి అటవీశాఖ నర్సరీలో మొక్కలు