
బీసీలకు రిజర్వేషన్ పెంపుపై హర్షం
ములుగు రూరల్: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వంగ రవియాదవ్ అన్నారు. ఈమేరకు శుక్రవారం జాతీయ రహదారిపై బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల రాజకీయ ఎదుగుదలకు సహకరించి మంత్రి వర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పౌడాల ఓంప్రకాశ్, గొర్రె అంకూష్, ఒజ్జల కుమార్, బొంత వేణు, జయపాల్‌రెడ్డి, ఒజ్జల లింగన్న, నిరంజన్, ఓడ రాజు కుక్కల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.