
అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్బంధ పాలన
ములుగు రూరల్: జిల్లాలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు నిర్బంధాన్ని కొనసాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట సోమవారం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతితో కలిసి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతునొక్కుతుందని విమర్శించారు. ఇటీవల గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ అర్హుడైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బెదిరింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రమేష్‌ది ప్రభుత్వ హత్యేగా అభివర్ణించారు. రమేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. రమేష్ మరణంపై శాంతియుత నిరసన చేపడతామని పోలీసుల అనుమతి కోరితే అనుమతి నిరాకరించడమే కాక పోలీస్ యాక్ట్‌ను అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వెళ్తున్న నాయకులను హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్తున్న క్రమంలో పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం మంత్రి సీతక్క కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులకు బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రుల పర్యటనకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి సీతక్క ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని ఆరోపించారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అరాచకాలను ప్రశ్నించిన వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సకినాల భవాని, భూక్య జంపన్న, మండల అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, చెన్న విజయ్, విజయ్‌రాంనాయక్, మాషిపెద్ది సత్యనారాయణరావు, మాలోత్ రవీందర్, కోగిల మహేష్, భిక్షపతి, ఆకుతోట చంద్రమౌళి, సమ్మయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్బంధ పాలన