
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి పీఓ 40 వినతి పత్రాలను స్వీకరించారు. ఈ మేరకు ములుగు మండలం పత్తిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థికి జంగాలపల్లి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 6వ తరగతి ఆడ్మిషన్ కావాలని విన్నవించారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన 17 మంది రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. మహాముత్తారం మండలం కోనంపేటకు చెందిన గిరిజన మహిళా పీఎంహెచ్ హాస్టల్‌లో ఏఎన్‌ఎం ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అలాగే పంబాపూర్ నుంచి గిరిజనుడు లివర్ సర్జరీ అయినందున ట్రైబల్ రిలీఫ్ ఫండ్ కింద సహాయం చేయాలని పీఓను వేడుకున్నారు. నర్సంపేట మండలం అశోక్‌నగర్‌లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూమిపై సోలార్ పవర్ ప్లాంట్ ఇప్పించాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం ముళ్లకట్టకు చెందిన ఓ గిరిజనుడు ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు.