చేపల వేట నిషేధం | - | Sakshi
Sakshi News home page

చేపల వేట నిషేధం

Jul 9 2025 6:59 AM | Updated on Jul 9 2025 6:59 AM

చేపల

చేపల వేట నిషేధం

వెంకటాపురం(ఎం): జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలలో జూలై, ఆగస్టు మాసాల్లో మత్స్య కార్మికులు చేపలు పట్టకుండా మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీ చేసింది. శాఖ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా చేపలు పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జూలై, ఆగస్టు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని రామప్ప సరస్సు, లక్నవరం జలాశయం, తుపాకులగూడెం ప్రాజెక్టు, నర్సింహసాగర్‌ ప్రాజెక్టు, పాలెం ప్రాజెక్టు లాంటి జలాశయాలపై పూర్తిస్థాయి మానిటరింగ్‌ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

రెండు కిలోల నుంచి..

రూ. రెండు లక్షల పిల్లలు

ఒక రెండు కిలోల చేప నుంచి రెండు లక్షల రూపాయలకు పైగా పిల్లలు పునరుత్పత్తి జరుగుతాయని మత్య్సశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందులో 10 శాతం బతికినా 20 వేల చేపలు ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్క చేపను కోల్పోయినా దాని నుంచి వచ్చే లక్షల చేప పిల్లలను కోల్పోయినట్లేనని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు జలాశయాల్లో చేప పిల్లల సంఖ్యను పెంచేందుకు మత్స్యశాఖ స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తే సహించేది లేదని అధికారులు వెల్లడిస్తున్నారు.

400 టన్నుల చేపల ఉత్పత్తి

జిల్లాలో నెలకు సుమారు 400 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన జలాశయాలతో పాటు 493 చెరువులు, కుంటలు ఉండగా వాటి పరిధిలో 14,204 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి ఉంది. జిల్లాలో 66 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా 4,853 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులు, కుంట ల్లోని చేపలను పట్టుకుని ఉపాధి పొందుతున్నారు.

చెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి

గత కొన్నేళ్లుగా జిల్లాలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువుల్లో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 79.83 లక్షల చేప పిల్లలను సబ్సిడీపై చెరువుల్లో విడుదల చేశారు. చేప పిల్లలను చెరువుల్లో వదిలే సమయం సరిగా లేకపోవడంతో చిన్న చేప పిల్లలను పెద్దవి తినడంతో పాటు వాతావరణం సహకరించక చేపపిల్లలు మృతిచెందుతూ వస్తుండడంతో ఈ పథకంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న చేపలను రెండు నెలల పాటు వేటాడకుండా అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు అవసరం లేకుండా, చెరువుల్లోని చేపలతోనే లక్షలు, కోట్ల చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.

రెండు నెలలు నిషేధం

జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని జలాశయాల్లో, చెరువులు, కుంటలలో చేపల వేటను నిషేధించడమైంది. ఈ రెండు నెలల్లో ఒక్కచేపను పట్టినా లక్షల చేపలను పుట్టకుండా చేసినట్లే. జూలై, ఆగస్టు నెలల్లోనే చేపలు పునరుత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి జలాశయాల్లోని చేపలకు ఇబ్బంది కలగకుండా మత్స్యకారులు సహకరించాలి. ఎవరైనా చేపలు పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి.

– సల్మాన్‌ రాజ్‌, జిల్లా మత్స్యశాఖాధికారి

పునరుత్పత్తి దశ కావడంతో మత్స్యశాఖ నిర్ణయం

జూలై, ఆగస్టు మాసంలో

చెరువుల్లో చేపలు పడితే చర్యలు

ప్రతినెలా 400 టన్నుల చేపల ఉత్పత్తి

జిల్లా వ్యాప్తంగా 4,853 మంది

మత్య్సకార్మికులకు ఉపాధి

నిషేధం ఎందుకంటే..

వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ఈ సమయంలో చేపల్లో పునరుత్పత్తి హార్మోన్‌ బలంగా అభివృద్ధి చెందుతుంది. జూలై, ఆగస్టులో చేపలు తమ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. ఆడ చేపలు ఎగ్‌ రిలీజ్‌ చేస్తే, మగ చేపలు స్పెర్మ్‌ను రిలీజ్‌ చేస్తాయి. దీంతో చేప పిల్లలు బయటకు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండటంతో పాటు చెత్తాచెదారం కొట్టుకుని వచ్చి నీళ్లపై తేలుతూ ఉంటుంది. ఈ సమయంలో చెత్తాచెదారం కింది భాగంలో ఆడ చేపలు గుడ్లపై పొదుగుతుంటాయి. వాటిపై సూర్యరశ్మి పడి రెండు మూడు రోజుల్లోనే గుడ్ల నుంచి చేప పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియంతా జూలై, ఆగస్టు నెలల్లో 3 నుంచి 5 సార్లు సాగుతుంది.

చేపల వేట నిషేధం1
1/1

చేపల వేట నిషేధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement