
వైఎస్సార్ సేవలు మరువలేనివి
ములుగు రూరల్: జనహృదయ నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ 76వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ ఎనలేని సేవలందించిన మహోన్నత వ్యక్తి అన్నారు. సీఎంగా వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దిక్చూచిగా మారాయని తెలిపారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఆయనదే అన్నారు. 104, 108 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర జలప్రభ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పెంచి దేశ మొత్తం గర్విచదగ్గ నాయకుడిగా మన్ననలు పొందారన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలను అందించి పేదల పెన్నిధిగా వైఎస్సార్ నిలిచారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
మంత్రి ధనసరి సీతక్క