
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ములుగు రూరల్: విద్యార్థులు లక్ష్యంతో చదవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇన్ఫోసిస్ వారి సహకారంతో కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఉంటు ఇదే పాఠశాలలో 4 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించానని తెలిపారు. చదువుపై ఆసక్తితో పీహెచ్‌డీ పూర్తి చేశానని వెల్లడించారు. లక్ష్యంతో చదివితే చదువుకు పేదరికం అడ్డుకాదని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నా భోజనం అందించడంతో పాటు పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో రూ. 6లక్షల నిధులతో మూడు టాయిలెట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి సీతక్కకు పాఠశాల విద్యార్థులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశా ఫౌండేషన్, ఈఎల్‌ఎఫ్ ఇంగ్లిష్ వారి సహకారంతో జిల్లాలో రెండోదశ లర్న్ టు రీడ్ కార్యక్రమాన్ని సీతక్క ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలని సూచించారు.
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో దివ్యాంగులకు మోటర్ వెహికిల్స్ మంత్రి సీతక్క అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు వాహనాలు అందించినట్లు వెల్లడించారు. కొడిశలకుంటకు చెందిన బానోత్ యాకూబ్, నర్సాపూర్ గ్రామానికి చెందిన గుర్రం శ్రీహరిలు వాహనాలు అందుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి