
ప్రాజెక్టులకు జలకళ
మంగపేట: జిల్లాలోని ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండలా మారాయి. పలుచోట్ల చెరువులు మత్తళ్లు పోస్తుండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. తొలుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు వర్షాలు ముఖం చాటేయడంతో ఆందోళన చెందిన రైతన్నలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం మద్యాహ్నం వరకు దంచికొట్టిన వానకు నీరు లేని పంట పొలాల్లో వరదలు పారాయి. చెరువులు, కుంటలతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లోనిమత్తడి పోస్తుండటంతో అన్నదాతలు వరినాట్లు వేయిస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రధాన జలాశయాల్లోకి భారీగా చేరిన నీరు
జిల్లాలో ప్రధాన జలాశయాలు అయిన నూగూరు వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టు, మంగపేటలోని మల్లూరువాగు మద్యతరహా ప్రాజెక్టు, గోవిందరావుపేట లోని లక్నవరం, వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప వంటి జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆయా ప్రాజెక్టులు, చెరువుల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సరిపడా నీరు వచ్చి చేరడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది.
లక్నవరం జలాశయంలోకి 24 అడుగులు
గోవిందరావుపేట: మండలంలోని లక్నవరం సరస్సులోకి వరద నీరు పోటెత్తింది. 34 అడుగుల సామర్థ్యం కలిగిన సరస్సుకు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో 24 గంటల వ్యవధిలోనే నాలుగు అడుగులు చేరి 24 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. తిరిగి ఇంక వరద పోటెత్తుతుండగా మరో రెండు అడుగులకు నీరు చేరే అవకాశం ఉంది.
24 అడుగుల్లో లక్నవరం జలాశయం
జలాశయాల్లో నీటిమట్టం వివరాలు
ప్రాజెక్టు మొత్తం ప్రస్తుతం ఆయకట్టు
నీటిమట్టం ఎకరాలు
మల్లూరువాగు
ప్రాజెక్టు 27 ఫీట్లు 21.3 ఫీట్లు 7,500
పాలెం ప్రాజెక్టు 136 మీటర్లు 132 మీటర్లు 10,125
లక్నవరం 33 ఫీట్లు 24 ఫీట్లు 8,794
రామప్ప 35 ఫీట్లు 22 ఫీట్లు 5,180
ఎడతెరిపి లేని వర్షంతో నిండుకుండల్లా చెరువులు, కుంటలు
అన్నదాతల్లో హర్షం
నీరు వృథాగా పోకుండా అధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తి
నాలుగు గేట్లు ఎత్తి.. దిగువకు నీరు
వెంకటాపురం(కె): మండల పరధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టు జలకళ సంతరిచుకుంది. పాలెం ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు చేరటంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టులకు జలకళ

ప్రాజెక్టులకు జలకళ