
రామదాసు స్ఫూర్తితో ప్రజాఉద్యమాలు
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
గోవిందరావుపేట: రామదాసు స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో వీరపనేని రామదాసు వెంకటసుబ్బమ్మల 5వ వర్థంతి సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ సీనియర్ నాయకుడు గుండు సత్యనారాయణ జెండా ఆవిష్కరించి, ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్మ సంఘం ఫంక్షన్‌హాల్‌లో సోమా మల్లారెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రామదాసు స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి జైలు జీవితం గడిపాడని తెలిపారు. కృష్ణా జిల్లాలో గన్నవరం తాలుకాలో కమ్యూనిస్టు పార్టీలో సుందరయ్యతో కలిసి పని చేశాడని తెలిపారు. అక్కడి నుంచి గోవిందరావుపేట కు వచ్చిన తర్వాత కూడా ఉద్యమాలను బలోపేతం చేశారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో సీపీఎం జిల్లాలో నాలుగు జెడ్పీటీసీలు 30ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి సాంబశివ పాల్గొన్నారు.