
ఇందిరమ్మకు చేయూత
లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ రుణాలు
మంగపేట: ఇల్లు లేని పేదలకోసం ప్రభుత్వం ఇందిరమ్మ పథకం పేరుతో ఇళ్లను మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సొంతింటి కల సాకారం అవుతుండడంతో ఆయా కుటుంబాలు సంబురపడుతున్నాయి. జిల్లాలో 9 మండలాలతోపాటు నూతనంగా ఏర్పడిన మల్లంపల్లిలో కలిపి మొత్తం 5,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరి చేసింది. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన గ్రామాల్లో పనులు 50 నుంచి 75 శాతం వరకు పూర్తికావచ్చాయి.
లబ్ధిదారులకు ఎంసీపీ రుణాలు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన మహిళా స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని సభ్యులు ఇంటి నిర్మాణం కోసం రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఎంసీపీ(మైక్రో క్రెడిట్ ప్లాన్) ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకుని సంఘ సభ్యుల తీర్మానం మేరకు బ్యాంకు నుంచి రూ.లక్ష అప్పు తీసుకున్న లబ్ధిదారు రూపాయి వడ్డీతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున 29 నెలలు చెల్లించే అవకాశం కల్పించారు. దీంతో ప్రభుత్వం ఇళ్ల మంజూరు చేయడంతోపాటు ఇంటి నిర్మాణానికి బ్యాంకులో రుణం తీసుకుని సులబ పద్దతిలో అప్పు చెల్లించే వెసులుబాటు కల్పించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మరంగా సాగుతున్న
నిర్మాణ పనులు
దశాబ్దాల కాలం నుంచి పక్కా ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక పూరిగుడిసెలు, రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్న నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలతోపాటు అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలులోకి తెచ్చి అభయాన్ని ఇచ్చిందని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మంజూరు పత్రాలను పొందిన లబ్ధిదారులు వర్షాకాలం అయినప్పటికీ త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి కొత్త ఇంటిలో చేరాలనే ఆశతో బ్యాంక్ లింకేజీ రుణాలు తీసుకుని పనులను చేయిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం లబ్ధిదారులకు బిల్లులు సైతం చెల్లిస్తుండంతో ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
రూ.50వేల నుంచి
రూ.2 లక్షల వరకు లోన్
ముమ్మరంగా నిర్మాణ పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు