ములుగు రూరల్: లో లెవల్ వంతెన
పై నుంచి ప్రవహిస్తున్న బొగ్గులవాగు
కొండాయి వద్ద
పడవలో ప్రయాణిస్తున్న ప్రజలు
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని రామన్నగూడెం వద్ద గోదావరి నది క్రమంగా పెరుగుతోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం 12.50 మీటర్ల నీటి మట్టంతో గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా గోదావరి శనివారం సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉండడంతో ఇరిగేషన్ అధికారులు కరకట్టకు ఉన్న షట్టర్లను శుక్రవారం సాయంత్రం మూసివేశారు. వరద నీరు గ్రామాల్లోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
పడవ ప్రయాణమే దిక్కు..
మండలంలోని కొండాయి వద్ద బ్రిడ్జి లేకపోవడంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, ఐలాపురం గ్రామాల ప్రజలు పడవలోనే ప్రయాణించి జంపన్నవాగును దాటుతున్నారు. ముసురుగా వర్షాలు పడుతుండడంతో వాగు ఉధృతి తగ్గలేదు. అలాగే ఎలిశెట్టిపల్లి వద్ద పడవల ద్వారా ప్రజలను, రైతులను దాటిస్తున్నారు. మండల కేంద్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలు ఉండడంతో జంపన్నవాగు ఉధృతి వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలను వినియోగించుకొని అవసరాలను తీర్చుకుంటున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గులవాగు
ములుగు రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని సర్వాపూర్–జగ్గన్నగూడెం గ్రామాల మధ్యలోని బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా శుక్రవారం బొగ్గుల వాగు లో లెవల్ వంతెన పైనుంచి ప్రవహించింది. దీంతో ప్రజలు వాగు దాటకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వాగుల్లో తగ్గని వరద ఉధృతి
కరకట్ట గేట్లు మూసివేత
పెరుగుతున్న గోదావరి