
వరదలతో అప్రమత్తం
ఏటూరునాగారం: జిల్లాలోని వాగులు, గోదావరి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతుందని ప్రజ లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర సూచించారు. మండల పరిధిలోని దొడ్ల, కొండాయి బ్రిడ్జి వద్ద జంపన్నవాగు వరద ఉధృతిని కలెక్టర్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజులు కురిసిన వర్షానికి జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగుపై గతంలో నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిందని తెలి పారు. కొండాయి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు, వైద్యాధికారులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. అత్యవసర పనుల కోసం బోటు అందుబాటులో ఉందని, అదనంగా రెండు బోటులు గు రువారం సాయంత్రానికి వస్తాయన్నారు. దీంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు బోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ టీంతో పాటు నాలుగు బోట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. అదే విధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదా వరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బోట్లతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
మండలాల్లోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులతో పాటు మిగతా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించే ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. రూంలో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు, తహసీల్దార్ జగదీశ్వర్, ఆర్‌ఐ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎరువుల విక్రయ కేంద్రం తనిఖీ
ఏటూరునాగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న ఎరువుల విక్రయ కేంద్రంలోని రికార్డులు తప్పకుండా ఉండాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి పీఏసీఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిల్లు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లు బుక్కులను పరిశీలించారు. అనంతరం గోదాములో నిల్వ చేసి ఉన్న విత్తనాలు, ఎరువులు, మందులను పరిశీలించారు.
అర్ధమయ్యేలా పాఠాలు బోధించాలి
గోవిందరావుపేట: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. మండల పరిధిలోని పస్రాలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను గురువారం కలెక్టర్ సందర్శించారు. టీచర్ల వివరాలతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీలించారు. అనంతరం క్లాస్ రూంలకు వెళ్లి విద్యార్థులతో పలు అంశాలు పైన మాట్లాడారు. అందరికి యూనిఫామ్స్, నోట్ బుక్స్ వచ్చాయా అంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
కొండాయిలో జంపన్నవాగు ఉధృతి పరిశీలన
టోల్‌ఫ్రీ నంబర్ 18004257109