
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 31న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి వేదికగా కింగ్డమ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. శనివారం జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు.
కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలన్నీ ట్రైలర్తో పటాపంచలయ్యాయి. ట్రైలర్ చూశాక కింగ్డమ్ మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్షన్ సీన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. బుల్లెట్ల వర్షం కురిపించిన ఈ ట్రైలర్లో.. చివర్లో కాంతార స్టైల్లో కనిపించిన వ్యక్తి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ స్టార్ కెమియో ఎవరు అంటూ నెట్టింట చర్చ మొదలైంది.
అయితే మొహానికి మాస్క్ ధరించి కాంతార స్టైల్లో కనిపించిన ఆ స్టార్ నటుడు ఎవరో గుర్తుపట్టండి అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ రక్షిత్ శెట్టి అని.. మరికొందరేమో హీరో నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ట్రైలర్లో ఉన్న స్టార్ ఎవరో తెలియాలంటే జూలై 31 వరకు వేచి చూడాల్సిందే.
కాగా.. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు.