
‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాలను గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని రకాల చిత్రాలను గొప్పగా ఆదరిస్తారు. వైవిధ్యమైన కథతో రూపొందిన మా ‘భద్రకాళి’ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిఇస్తుంది’’ అని హీరోయిన్లు తృప్తీ రవీంద్ర, రియా జిత్తు పేర్కొన్నారు. విజయ్ ఆంటోని నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా తృప్తి రవీంద్ర మాట్లాడుతూ–‘‘మాది మహారాష్ట్ర. సినిమాలపై ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేశాను. నా తొలి ఫీచర్ ఫిలిం ‘భద్రకాళి’. విజయ్‌గారితో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మీరా, రామాంజనేయులుగార్లు చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. రియా జిత్తు మాట్లాడుతూ– ‘‘మలయాళి అయిన నేను మలయాళ, తమిళ సినిమాలు చూస్తూ పెరిగాను. దాదాపు 15 సినిమాల్లో బాలనటిగా చేశాను. కొంచెం బ్రేక్ తీసుకుని, చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ‘భద్రకాళి’ లాంటి కథ సమాజానికి చాలా అవసరం. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అన్నారు.