
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మన ఇరుగు పొరుగు ఎవరున్నారో, ఏం చేస్తున్నారో అని తెలుసుకునే అవకాశం, తీరిక లేని బిజీ రోజుల్లో గడుపుతున్నాం. మన పొరుగింట్లో దొంగ దూరినా లేదా దొర వచ్చినా మనకు తెలిసే సమయానికి తెల్లారిపోతుంది. కానీ అదే ఇరుగు పొరుగు వారి కోసం ఓ కాలనీ వాళ్ళు ఏం చేశారన్నదే ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’(Tourist Family) సినిమా. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా బాగా దక్కింది. మరీ ముఖ్యంగా మన ప్రపంచ స్థాయి దర్శక జక్కన్న రాజమౌళి ఈ సినిమాని ప్రశంసించడం విశేషం. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి చూద్దాం.
శ్రీలంక దేశం నుండి ధర్మాన దాస్ కుటుంబం అక్రమంగా సముద్ర మార్గాన భారత్‌లోని తమిళనాడు తీర ప్రాంతానికి చేరుకుంటుంది. ధర్మాన దాస్ సతీమణి వాసంతి. వాళ్ళకిద్దరు పిల్లలు నితూషన్, ముల్లి. శ్రీలంకలో సంక్షోభం వల్ల భారత్‌లో సంపాదించడానికి వాసంతి సోదరుడు ప్రకాశ్ సహాయంతో కుటుంబం అంతా రామేశ్వరానికి వస్తారు. అదే ఊర్లో ఉన్న కేశవనగర్ కాలనీలో ఓ ఇంట్లోకి అద్దెకి చేరతారు. ఆ కాలనీ చాలా విచిత్రమైనది. ఎవ్వరి మార్గం వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. ధర్మాన దాస్ తమ శ్రీలంక ఉనికి ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు.
ఈ లోపల అదే ఊరిలోని ఓ చెత్త కుప్పలో భారీ బాంబు పేలుడు సంభవిస్తుంది. అంతకుముందే ధర్మాన దాస్ ఆ చెత్త తొట్టిలో తాము తిన్న పదార్థాల కవర్ వేస్తాడు. అది కాస్తా సీసీ టీవీలో రికార్డు అవుతుంది. దాంతోపోలీసులు ధర్మాన దాస్ కుటుంబం కోసం గాలిస్తుంటారు. ఓ పక్క తమ శ్రీలంక ఐడెంటీటీ ఇతరులకు తెలియనివ్వకుండా, మరో పక్క ఈపోలీస్ కేసును దర్మాన దాస్ కుటుంబం ఎలా ఎదుర్కొంటుందో ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.
ఈ సినిమాకి మూల కథ రాసుకుని అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు శశికుమార్ హీరో పాత్రలో నటించగా, ప్రముఖ నటి సిమ్రాన్ హీరోయిన్‌గా నటించి అలరించారు. ముఖ్యంగా ధర్మాన దాస్ చిన్న కొడుకు ముల్లి పెట్టే గిలిగింతలు మామూలుగా ఉండవు. సినిమా మంచి ఎంటర్‌టైనర్. హాట్ స్టార్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం... ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో ఈ వారం టూర్‌కి వెళ్ళండి. – హరికృష్ణ ఇంటూరు