
సినిమా అనేది కలల ప్రపంచం. రంగులరాట్నం లాంటి ఈ ప్రపంచంలో అందలం ఎక్కడమే కాదు, అవమానాలు, ఆవేదనలు ఎదురవుతుంటాయి. అన్నీ ఎదురొడ్డి నిలబడగల శక్తి ,పట్టుదల, శ్రమ, కృషి ఉంటేనే ఉన్నత స్థాయికి ఎదగగలరు. ఇందుకు చిన్న ఉదాహరణ నయనతార. దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా వెలిగిపోతున్న నటి ఈమె. అంతేకాకుండా, నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ రాణిస్తున్న నయన జీవితం తెరిచిన పుస్తకం అని తనే చాలా ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అయితే ఆమె జీవితంలోనూ కొన్ని చేదు అనుభవాలతో కూడిన పేజీలు ఉన్నాయి. కేరళలోని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన నయనతార అసలు పేరు డయానా కురియన్ అని తెలిసిందే. .
అయితే ఆమె, ఈ స్థాయికి చేరుకునేందుకు పడ్డ శ్రమ, అవమానాలు, ఆవేదనలు చాలానే ఉన్నాయి. నటనపై ఆసక్తితో ఈ రంగానికి వచ్చిన నయనతారకు కోలీవుడ్‌లో ముందుగా అవకాశం కల్పించింది నటుడు, దర్శకుడు పార్థిబన్. అయితే చెప్పిన సమయానికి నయన రాకపోవడంతో తిరిగి పంపించేసినట్లు పార్థిబన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నయనతార కథానాయకిగా నటించిన తొలి తమిళ చిత్రం అయ్యా. అయితే ఈ చిత్ర షూటింగ్ తొలి రోజునే నయన దర్శకుడు హరి ఆగ్రహానికి గురయ్యారు. తొలి రోజున మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌గా షూటింగ్ స్పాట్‌కు వచ్చిన ఆమెను చూసి దర్శకుడు టెన్సన్ పడ్డారు.

ఈమెను ఇక్కడ నుంచి వెంటనే బయటకు పంపించేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి నయనతార పనికి రాదు అని అన్నారు. సాయంతం వేరే డ్రస్ మార్చి చూద్దాం అని చెప్పారట. ఈ విషయాన్ని ఆ చిత్ర కథానాయకుడు శరత్‌కుమార్ ఇటీవల ఒక వేదికపై చెప్పారు. ఆ తరువాత తన పాత్రకు తగ్గట్టుగా వేషధారణను మార్చుకుని అయ్యా చిత్రంలో నటింపజేశారట. అయితే ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడం, ఆ తరువాత రజనీకాంత్‌కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించే అవకాశం వరించడం వంటివి జరగడంతో నయన అగ్ర కథానాయకిగా ఎదిగారు. ప్రేమ వ్యవహారంలో నయనతార చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు. ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలతో జీవితాన్ని సుఖమయం చేసుకున్నారు.