2026 సంవత్సరానికి టాలీవుడ్ ఘనంగా శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళకళలాడాయి. ఒక్క సినిమా తప్ప మిగతావన్నీ క్లిక్ అవ్వడం సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన శుభారంభం. ప్రేక్షకులు కూడా ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే సంక్రాంతి ఊపు కొనసాగించాల్సిన సమయంలో షెడ్యూల్‌లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా సైడ్ అవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జనవరి చివరి వారాల్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా లేదు. చిన్న సినిమాలే వరుసగా రావడం వల్ల బాక్సాఫీస్‌లో స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది. 
ఫిబ్రవరిలో పెద్ద సినిమా స్వయంభూ మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈ సినిమా విడుదల తేదీపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. వాయిదా పడుతుందేమో అనే వార్తలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్వయంభూ వాయిదా పడితే ఫిబ్రవరిలో మరో పెద్ద సినిమా లేదు. మార్చి నుంచి మళ్లీ పెద్ద సినిమాల హవా మొదలవుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మార్చి కూడా డ్రైగానే ముగిసేలా ఉంది. ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడినట్టే. పెద్ది సినిమా కూడా బాలీవుడ్ పోటీ కారణంగా తటపటాయిస్తోంది. కొంతమంది మాత్రం పెద్ది కూడా వాయిదా పడుతుందని అంటున్నారు. కానీ చెప్పలేం ఏం జరుగుతుందో చూడాలి.
ఒకవేళ మార్చిలో పెద్ది కూడా వాయిదా పడితే డెకాయిట్ తప్ప మరో పెద్ద సినిమా లేకపోవడం ఖాయం. దీంతో మొత్తం పరిస్థితి టాక్సిక్ సినిమాకే దారిచ్చినట్టవుతుంది. రాబోయే రెండు నెలలు పెద్ద సినిమాల లేని డ్రై సీజన్‌గా మారే అవకాశం ఉంది. ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.కానీ విడుదలల అనిశ్చితి వల్ల ఆ ఉత్సాహం తగ్గిపోయే అవకాశం ఉంది.


