
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీముని పట్నంలో జని్మంచారు పెద్దాడ మూర్తి. తన తండ్రి పెద్దాడ వీరభద్రరావు నుంచి సాహిత్యాన్ని వంటబట్టించుకున్నారాయన. కాళీపట్నం రామారావు వంటి ప్రముఖుల రచనలతో స్ఫూర్తి పొందిన పెద్దాడ మూర్తి డిగ్రీ చదువుతున్న సమయంలోనే ‘పతంజలి’ అనే పత్రికలో జర్నలిస్టుగా చేశారు.
వేటూరి స్ఫూర్తితో గేయ రచయితగా మారాలనుకున్నారు. దర్శకుడు కృష్ణవంశీతో పరిచయం ఉండడంతో హైదరాబాద్‌కి వచి్చన మూర్తి సినీ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. పలు సినీ వార పత్రికలు, దినపత్రికల్లో పని చేశారు. మూర్తికి దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలిసారి ‘కూతురు’ (1996) సినిమాలో పాట రాసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రవితేజ ‘ఇడియట్’ (చెలియా చెలియా..), ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ (నీవే నీవే..), చిరంజీవి ‘స్టాలిన్’ (సిగ్గుతో ఛీ ఛీ..), కృష్ణవంశీ ‘చందమామ’ (బుగ్గే బంగారమా..), మధుమాసం, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ, అది నువ్వే, నాకూ ఓ లవర్ ఉంది’ వంటి పలు సినిమాలకు పాటలు రాశారు పెద్దాడ మూర్తి.
పలు టీవీ సీరియల్స్‌కీ పాటలు రాశారు. అలాగే ‘ఇష్ట సఖి, హౌస్‌ఫుల్’ అనే ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. ‘తారా మణిహారం’ అనే పుస్తకాన్ని రచించారు. మూర్తి మాటలు, పాటలు అందించిన ‘నాగలి’ సినిమా త్వరలో విడుదల కానుంది. మూర్తి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేశారు. కాగా పెద్దాడ మూర్తికి భార్య సంధ్య, కుమార్తె సుగాత్రి, కుమారుడు అభిజీత్ ఉన్నారు. హైదరాబాద్ లోని ఈఎస్‌ఐ స్మశాన వాటికలో నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.