
ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలు అపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి వారు ఏడాదికి ఆరేడు సినిమాలు ఈజీగా చేసేవారు. తర్వాతి తరం హీరోలు కూడా మొదట్లో అదే ఫాలో అయ్యారు. నెమ్మదిగా ఇప్పుడా సంఖ్య ఒకటీరెండుకు వచ్చేసింది. ఈ తరం హీరోలైతే ఏకంగా ఏడాదికో, లేక రెండుమూడేళ్లకో ఒక సినిమా చేస్తున్నారు.
ఒక్క హీరోయిన్‌తో 130 చిత్రాలు
అప్పట్లో మలయాళ స్టార్ హీరో ప్రేమ్ నజీర్ (Prem Nazir) ఏడాదికి ఒకటీరెండు కాదు ఏకంగా 30 సినిమాలు చేసేవారు. ఆ లెక్కన ఆయన ఏడువందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రపంచ రికార్డు సృష్టించారు. తన కెరీర్‌లో దాదాపు 80 మంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. అందులోనూ ఓ హీరోయిన్(షీల)తో ఏకంగా 130 సినిమాలు చేయడం విశేషం! ఈయన తెలుగులో ఆకలి, తండ్రి చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలిగిన నజీర్ 1989లో కన్నుమూశారు.
సినిమా ఛాన్స్ కోసం కన్నీళ్లు
అయితే నజీర్ చివరి రోజుల్లో అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్నారని నటుడు టిని టామ్ వ్యాఖ్యానించాడు. ఛాన్సులిప్పించమని అడూర్ భసి, బహదూర్ వంటి నటుల ఇళ్లకు వెళ్లి కన్నీళ్లతో వేడుకునేవారని ఆయన పేర్కొన్నాడు. ఈ కామెంట్స్‌పై సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి మండిపడింది. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. 1985 వరకు మేమందరం నజీర్‌తో కలిసి పని చేసినవాళ్లమే! ఆయన జీవితాన్ని దగ్గరి నుంచి చూసిన మా అందరికీ టినీ కామెంట్స్ బాధ కలిగించాయి.

చివరి రోజుల్లో..
ప్రేమ్ నజీర్ చనిపోవడానికి ముందు కూడా ఆయన్ను కలిశాను. తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రశాంత జీవనం గడిపాడు. తనకు సినిమా అవకాశాలు వచ్చినా సరే.. వేరొకరికి ఇవ్వమని సూచించేవాడు. అలాంటిది చివరి రోజుల్లో అవకాశాల్లేక ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పడం కరెక్ట్ కాదు. నజీర్ బతికున్నప్పుడు టిని ఇంకా సినిమాల్లోకే రాలేదు. వాళ్లూవీళ్లు అనుకునే మాటలను నిజమని నమ్మి ఇలా అసత్య ప్రచారం చేయడం సరికాదు.
ఎవరినీ అడుక్కోలేదు
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం దివంగత నటుల గురించి లేనిపోని కథలు అల్లేస్తున్నారు. కనీసం ఇండస్ట్రీలో ఉన్నవారైనా వారి గురించి నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ప్రేమ్ నజీర్ సినిమా ఛాన్సుల కోసం ఎప్పుడూ ఏడవలేదు. ఎవరినీ అడుక్కోలేదు. అలాంటి గొప్ప మనిషి గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి అని ఘాటుగానే స్పందించింది.
క్షమించండి
దీంతో నజీర్ గురించి అలా మాట్లాడినందుకు టిని టామ్ ఫేస్‌బుక్ వేదికగా క్షమాపణలు తెలిపాడు. నజీర్ సర్‌ను అభిమానించేవారిలో నేనొకరిని. ఆయన స్థానమెక్కడ? నేనెక్కడ? తనను ఒక్కసారి కూడా కలవనేలేదు. ఆయన గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తిని కాదు. తన ఇమేజ్‌ను చెడగొట్టాలన్న దురుద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో ఓ వ్యక్తి చెప్పినదాన్ని మీతో పంచుకున్నానంతే.. అయినప్పటికీ నావల్ల పొరపాటు జరిగింది కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నాడు.