విజయ్‌ క్రేజ్‌ మామూలుగా లేదుగా

Thalapathy 66 Expected be one of Vijay most Expensive Film - Sakshi

దళపతి విజయ్‌ చిత్రం అంటేనే క్రేజ్‌. ఆయన చిత్రాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతగా ఎదురు చూస్తుంటారు. ఆయన చిత్రాలు హిట్, ప్లాప్‌లకు అతీతం అనవచ్చు. అలాంటి నటుడు తాజాగా వారసుడు చిత్రంతో టాలీవుడ్‌లో వసూళ్లు కొల్లగొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పొంగల్‌కు తమిళంతో పాటు తెలుగు, మళయాళం తదితర భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో విజయ్‌ నటించనున్న ఆయన 66వ చిత్రంపైనా ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

కారణం విజయ్‌ మాత్రమే కాదు దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ కూడా. ఈ  దర్శకుడు చేసింది నాలుగే చిత్రాలైనా, లేటెస్ట్‌గా కమలహాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తాజాగా నటుడు విజయ్‌తో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు రూపొందిన మాస్టర్‌ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా క్రేజీ కాంబినేషన్‌లను కల్పించడంలో లోకేశ్‌ కనకరాజ్‌ దిట్ట. ఇప్పుడు విజయ్‌ హీరోగా చేస్తున్న కాంబో అంతకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో విజయ్‌ ముంబాయి డాన్‌గా నటించబోతున్నారని తెలిసింది.

చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్‌)

ఇందులో బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్, నటుడు విశాల్‌ విలన్లుగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. అదే విధంగా ఉలగనాయకుడు కమలహాసన్‌ గెస్ట్‌ రోల్‌లో మెరవబోతున్నట్లు వార్త వైరల్‌ అవుతోంది. ఇకపోతే నటి త్రిష కథానాయకిగా ఇదివరకే ఎంపికయ్యారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌ కుమార్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభానికి ముందు వ్యాపార పరంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్ర శాటిలైట్‌ హక్కులను సన్‌ పిక్చర్స్‌ సంస్థ, డిజిటల్‌ హక్కులను నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. చిత్ర ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాల్లో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ బిజీగా ఉన్నారు. డిసెంబర్‌ నెలలో ఈ చిత్రం వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top