
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి వచ్చిన వాటిలో 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అనుష్క 'ఘాటీ'కి నెగిటివ్ టాక్ రాగా.. తమిళ డబ్బింగ్ 'మదరాసి' యావరేజ్ అనిపించుకుంది. మరోవైపు ఓటీటీల్లోనూ పలు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు-వెబ్ సిరీసులు వచ్చాయి. అవి కాకుండా మరో మూడు తెలుగు మూవీస్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రాలు? ఎందులోకి వచ్చాయి?
'ఆదిత్య విక్రమ వ్యూహ' పేరుతో తీసిన ఓ తెలుగు చిత్రం నేరుగా ఆహా ఓటీటీలోకి వచ్చింది. నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తొమ్మిది మందిని హత్య చేసి, జైలుకెళ్లిన ఓ ఖైదీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దీంతో వాడిని పట్టుకునేందుకు హీరోలిద్దరూ కలిసి ఓ మిషన్ చేపడతారు. తర్వాత ఏమైంది? హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే మిగతా స్టోరీ. శ్రీ హర్ష, అరవింద్ ప్రధాన పాత్రలు పోషించగా.. శ్రీహర్షనే దర్శకత్వం కూడా వహించాడు.
(ఇదీ చదవండి: ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?)
అలానే 2021 డిసెంబరులో థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'బుల్లెట్ సత్యం'. దేవ్ రాజ్, సోనాక్షి వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పడు ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటీటీలో నిన్నటి (సెప్టెంబరు 05) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. బుల్లెట్ సత్యం చేసిన రాజకీయం ఏంటనేదే మూవీ స్టోరీ. కుటుంబ బంధాలతోపాటు రాజకీయ నేరాలు, థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉన్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 18న రిలీజైన 'జగమెరిగిన సత్యం' సినిమా.. థియేటర్లలో పెద్దగా నిలబడలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు ఐదు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. హీరో రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తెలంగాణలోని ఓ చిన్న ఊరిలో సత్యం (అవినాష్ వర్మ) అనే యువకుడి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్‌తో దీన్ని తెరకెక్కించారు.
(ఇదీ చదవండి: 46 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న స్టార్ కమెడియన్)