ఛార్జీలు చెల్లించేది లేదు | Telugu Film Producers Council Says Not Pay Of Charges For Virtual Print Fee | Sakshi
Sakshi News home page

ఛార్జీలు చెల్లించేది లేదు

Published Wed, Dec 16 2020 9:14 AM | Last Updated on Wed, Dec 16 2020 10:22 AM

Telugu Film Producers‌ Council Says Not Pay Of Charges For Virtual Print Fee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్టీప్లెక్స్‌లు, ఇతర థియేటర్లను పునః ప్రారంభించే విషయంపై హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌’ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి జరిపిన ఈ మీటింగులో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, నిర్మాతలు, పంపిణీదారులు, సినిమా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు విషయాలు చర్చించామంటూ, ఆ అంశాలను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, మోహన్‌ వడ్లపట్ల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

  • డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్లకు నిర్మాతలు వర్చ్యువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) ఛార్జీలు చెల్లించరు.
  • అయితే, కంటెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కోసం మాత్రం నిర్మాతలు నామమాత్రపు ఛార్జీలు చెల్లిస్తారు.
  • రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న తమ ప్రొజెక్టర్లను ఆయా థియేటర్‌ ఓనర్స్‌ కొనుగోలు చేయడానికి వీలుగా డిజిటల్‌ ప్రొవైడర్లు ఆప్షన్‌ ఇవ్వాలి. దీని వల్ల ప్రకటనల ఆదాయాన్ని స్వీకరించడానికి థియేటర్‌ ఓనర్స్‌కు వీలు కలుగుతుంది.
  • థియేటర్‌ యజమానులు ప్రొజెక్టర్లను కొనుగోలు చేయలేకపోతే, నిర్మాతలు కొంతవరకు కల్పించుకొని ప్రొజెక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయం చేస్తారు.
  • మొదటి మూడు అంశాలకూ డిజిటల్‌ ప్రొవైడర్లు అంగీకరించకపోతే, థియేటర్‌ యజమానులు వారి సొంత ప్రొజెక్టర్లుతో నడిపిస్తారు.
  • కాగా, ఈ సమస్యలపై గురువారం సాయంత్రం 4 గంటలకు మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు నిర్మాతల మండలి తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement