టెక్నాలజీతో కొత్త అవకాశాలు వస్తాయి: మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు | Telangana Minister Duddilla Sridhar Babu Inaugurates Dil Raju Larven AI Studio | Sakshi
Sakshi News home page

టెక్నాలజీతో కొత్త అవకాశాలు వస్తాయి: మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు

May 4 2025 2:57 AM | Updated on May 4 2025 2:57 AM

Telangana Minister Duddilla Sridhar Babu Inaugurates Dil Raju Larven AI Studio

సుకుమార్, వైఘా, ‘దిల్‌’ రాజు, అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, అల్లు అరవింద్‌, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు

‘‘ఏఐ (కృత్రిమ మేధ) ఆధారంగా చాలా సినిమాలు వస్తున్నాయి. క్రియేటివిటీని డూప్లికేట్‌ చేయలేం గానీ, క్రియేటివిటీని టెక్నాలజీతో మెరుగుపరచవచ్చు. టెక్నాలజీ వల్ల కొత్త కొత్త అవకాశాలు,  ఉద్యోగాలు వస్తాయి. ప్రతి రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు తెలిపారు. నిర్మాత ‘దిల్‌’ రాజు నెలకొల్పిన ‘లోర్వెన్‌ ఏఐ’ స్టూడియో లాంచ్‌ ఈవెంట్‌ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు  ముఖ్య అతిథిగా హాజరైన దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ– ‘‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగానికి పరిచయం చేయాలనే సంకల్పంతో ‘దిల్‌’ రాజుగారు ‘లోర్వెన్‌ ఏఐ’ స్టూడియోని లాంచ్‌ చేయడం అభినందనీయం. 

ఎంటర్‌టైన్ మెంట్‌ వరల్డ్‌ని ఈ స్టూడియో నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ‘క్వాంటం నెక్ట్స్‌ లెవెల్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ వారు ‘లోర్వెన్‌ ఏఐ’ స్టూడియోలో భాగస్వామ్యం కావడం అభినందనీయం. హాలీవుడ్‌కి దీటుగా హైదరాబాద్‌ ఎదుగుతోంది. ఈరోజు జరిగిన నాలుగు ప్రొడక్ట్స్‌ లాంచ్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో గేమ్‌ చేంజర్స్‌ అనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఏఐ గురించి రెండేళ్లుగా చర్చలుప్రారంభించాం. మా కంపెనీ నుంచి స్టార్ట్‌ అయిన టీం, క్వాంటంతో కలసి సినిమా గురించి డెవలప్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. 

360 డిగ్రీస్‌ సినిమాని ఎలా చేయొచ్చు అనేది క్రియేటివ్‌గా డెవలప్‌ చేయడం జరిగింది. స్క్రిప్ట్‌ ఐడియా, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్‌ ప్రొడక్షన్, ప్రమోషన్స్... ఇలా స్టెప్‌ బై స్టెప్‌గా డెవలప్‌ చేశాం. టైమ్‌ సేవ్‌ అవ్వడం వల్ల దర్శకులు ఎక్కువ సినిమాలు తీస్తారు, ప్రొడ్యూసర్స్‌కి డబ్బులు ఆదా అవుతాయి. ‘లోర్వెన్‌ ఏఐ’ అనేది ఎమోషన్‌ లేని ఒక ఫస్ట్‌ ఏడీగా భావించవచ్చు. మా బ్యానర్‌లో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్ధన’ సినిమా తీస్తున్న డైరెక్టర్‌ రవికిరణ్‌ ఇందులో వర్క్‌ చేస్తున్నారు. తన స్క్రిప్టు ప్రీ ప్రొడక్షన్‌ ‘లోర్వెన్‌ ఏఐ’లోనే జరుగుతోంది. మిగతా ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్‌ హౌసెస్‌ ‘లోర్వెన్‌ ఏఐ’ కావాలనుకుంటే సంప్రదించవచ్చు’’ అన్నారు.

‘‘దిల్‌’ రాజు ప్రతిదాంట్లో ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో ఎంటర్‌టైన్మెంట్‌ ఇండస్ట్రీలోకి ఏఐని ప్రవేశపెట్టడంలోనూ ముందడుగు వేశారు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఈ వేడుకలో పలువురు దర్శక–నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement