మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న హీరోయిన్ టీనా శ్రావ్య తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో రిలీజ్ చేసింది. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదని!
కుక్కకి సర్జరీ
నేను పెంచుకుంటున్న కుక్కకి 12 ఏళ్లు. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది మంచిగా కోలుకోవాలని సమ్మక్కను మొక్కుకున్నాను. అనుకున్నట్లుగానే కుక్క కోలుకుని బాగా నడుస్తోంది. అందుకే మొక్కు చెల్లించాలని నా కుక్కతో బంగారం (బెల్లం) తూకం వేయించాను. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు.
తప్పు తెలుసుకున్నా
మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగనివ్వను. మన సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించమని కోరుతున్నాను అని చేతులెత్తి వేడుకుంది.
మేడారం జాతర
తెలంగాణలోని మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఎంతో విశిష్టమైనది. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ వేడుకకు లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. చాలామంది వారి బరువుకు సరిపడా బంగారాన్ని (బెల్లాన్ని) అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తారు. ఈ క్రమంలోనే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' హీరోయిన్ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురూ ఆమె చేసిన పనిని విమర్శించారు. దాంతో ఆమె ఇలా వివరణ ఇచ్చుకుంది.
చదవండి: తెలుగు, తమిళ హీరోయిన్స్‌పై రాజాసాబ్ బ్యూటీ సెటైర్లు


