మిడిల్‌క్లాస్‌ వాళ్లకోసమే.. ఘోస్ట్‌ టికెట్‌ రేట్లు తగ్గించాం: నిర్మాత

Sunil Narang About Ticket Prices And OTT Release At Ghost Movie Press Meet - Sakshi

‘‘వందకి ఎనభైశాతం మంది మధ్యతరగతి ప్రేక్షకులే సినిమాలు చూస్తారు. వారు లేకుంటే ఇండస్ట్రీ లేదు.. అందుకే మిడిల్‌క్లాస్‌ వారిని దృష్టిలో పెట్టుకునే ‘ది ఘోస్ట్‌’ టికెట్‌ ధరలు నిర్ణయించాం’’ అని నిర్మాత సునీల్‌ నారంగ్‌ అన్నారు. అక్కినేని నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌ జంటగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ– ‘‘నాన్నగారితో(నారాయణ్‌ దాస్‌) ఉన్న అనుబంధంతో నాగార్జునగారు ఈ సినిమా చేసినందుకు థ్యాంక్స్‌. ప్రవీణ్‌ సత్తారు అద్భుతంగా తీశాడు. ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడ్డారు.. రెండు వారాల తర్వాత ఓటీటీలో వస్తుందని అనుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో టికెట్‌ ధర పెట్టి సినిమా చూసేందుకు ఇష్టపడటం లేదు. సినిమా చాలా బాగుందనే టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లడం లేదు. అలాగే టికెట్, క్యాంటీన్‌లో ధరలు కూడా తగ్గితే చిన్న సినిమాకి కూడా ప్రేక్షకులు మునుపటిలా థియేటర్‌కి వస్తారు. ఓటీటీని నియంత్రించాలనే చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ– ‘‘గ్రేట్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్న కంప్లీట్‌ మాస్‌ యాక్షన్‌ మూవీ ‘ది ఘోస్ట్‌’. నాగార్జున కెరీర్లో భారీ బడ్జెట్‌ చిత్రమిది. సంక్రాంతిలానే దసరా కూడా సినిమా పండగ. రెండు పెద్ద చిత్రాలు (గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్‌) రావడం ప్రేక్షకులకు సినిమా పండగలా ఉంటుంది. మా సినిమా తొమ్మిదిరోజులు బాగా ఆడితే చాలు.. ఈ నెల 14వ తారీఖు వరకూ.. ఇక నాగార్జునగారి ట్రెండ్‌ సెట్టర్‌ ‘శివ’ కూడా అక్టోబర్‌ 5 విడుదలయింది. ఆ సెంటిమెంట్‌ ప్రకారం అక్టోబర్‌ 5న ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం మా బ్యానర్‌లో రూపొందిన ‘ప్రిన్స్‌’ దీపావళికి విడుదలవుతుంది. సందీప్‌ కిషన్‌తో ఓ సినిమా, సుధీర్‌ బాబుతో ఒక మూవీ, శేఖర్‌ కమ్ముల– ధనుష్‌ కాంబోలో ఓ చిత్రం చే స్తున్నాం. అలాగే వెంకటేష్‌గారితో ఒక సినిమా ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top