
షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోలు
విదేశాల్లో తెలుగు హీరోలు
వేసవి వచ్చిందంటే చాలు... స్కూల్స్, కాలేజీలు క్లోజ్ అవుతాయి. స్టూడెంట్స్‌కు సెలవులొచ్చేస్తాయి. అలాగే ప్రతి ఏడాది సినిమా స్కూల్స్‌కు కూడా వేసవి సెలవులు వస్తుంటాయి. ఈ సెలవుల్లో మెజారిటీ స్టార్ హీరోలు షూటింగ్ నుంచి బ్రేక్స్ తీసుకుంటుంటారు. అలా ఈ ఏడాది షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేయండి.
లండన్‌లో ల్యాండ్
నిన్న మొన్నటివరకు ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే లండన్‌లో ల్యాండ్ అయ్యారు. ఆయన తనయుడు, హీరో– నిర్మాత రామ్‌చరణ్ మైనపు విగ్రహం లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు చిరంజీవి. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిసింది.
ఈ మూవీలో నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. సాహు గార పాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాకు చిన్న పాటి ΄్యాచ్ వర్క్, ఓ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయట. వీలు చూసుకుని, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా కొత్త విడుదల తేదీపై అతి త్వరలోనే ఓ స్పష్టత రానుంది.
ఓవర్ టు ఓజీ
కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ, సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ వంతు షూటింగ్ పూర్తయింది. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ నిర్మించారు. అయితే ఈ సినిమాను తొలుత మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ...పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాని నేపథ్యంలో రిలీజ్‌ను వాయిదా వేశారని, అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుందని తెలిసింది. రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.
తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ విడుదలవుతుంది. ఇలా ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కావడంతో, ఇక పవన్ ఫోకస్ అంతా ‘ఓజీ’ సినిమాపైనే. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన పవన్ కల్యాణ్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. అతి త్వరలోనే ఆయన ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు.
ఫారిన్ వెకేషన్
ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్తుంటారు హీరో మహేశ్‌బాబు. అయితే ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమాప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు ఈ ఏడాది ఫారిన్ హాలిడే బ్రేక్ దొరక్కపోవచ్చని కొందరు అనుకున్నారు. కానీ మహేశ్‌బాబుకు ఆ అవకాశం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో ఉన్నారని సమాచారం.
ఇంకా రెండు వారాలు మహేశ్‌బాబు అక్కడే ఉంటారట. వచ్చిన తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారు. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.
ఇటలీలో...
‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో కొన్ని రోజులు క్రితం బిజీ బిజీగా గడి పారు ప్రభాస్. దాంతో ఈ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చి, ఇటీవల ఫారిన్ వెళ్లారు ప్రభాస్. దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రభాస్ ఇటలీలోనే ఉంటున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలనుప్రారంభిస్తారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరో నటి రిద్దీ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘ఫౌజి’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ‘ఫౌజి’ సినిమా విడుదల కానుంది.
లండన్‌లో...
లండన్ వెళ్లారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రకరణ కర్ణాటకలో జరిగింది. ఎన్టీఆర్ పాల్గొనగా, యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత టాకీ పార్టును చిత్రీకరించారు ప్రశాంత్ నీల్. కాగా ఈ కర్ణాటక షూటింగ్ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ లండన్ వెళ్లారని తెలిసింది. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా స్క్రీనింగ్ జరగనుందని తెలిసింది. అలాగే ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి లైవ్ కాన్సెర్ట్ కూడా ఉంది.
ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్తున్నారని తెలిసింది. ఈ వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఈ చిత్రదర్శకుడు రాజమౌళిలతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్’ యూనిట్‌లోని మరికొందరు పాల్గొంటారట. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
విదేశాల్లో వెరీ బిజీ
‘పెద్ది’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, లండన్ వెళ్లారు రామ్‌చరణ్. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ ఆల్రెడీ లండన్‌లోనే ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రస్తుతం రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఆరంభిస్తారు రామ్‌చరణ్.
బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు, శివ రాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వీరితో పాటు మరికొందరు హీరోలు ఈ వేసవికి షూటింగ్ బ్రేక్స్ ఇచ్చారు.– ముసిమి శివాంజనేయులు
వేసవి తర్వాతే...
ఈ వేసవికి కొందరు హీరోలు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వగా, ఈ వేసవి తర్వాతనే కొత్త సినిమా షూటింగ్‌లనుప్రారంభించాలని మరి కొందరు హీరోలు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నెక్ట్స్ సినిమాపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వెంకటేశ్ కూడా చాలా కథలు వింటున్నారు. కాగా వెంకటేశ్ నెక్ట్స్ మూవీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని, వేసవి తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ చెప్పిన ఓ కథ నాగార్జునకు నచ్చిందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. వేసవి తర్వాతనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలని నాగార్జున భావిస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి తర్వాతే ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలని అట్లీ అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా మరికొంతమంది తెలుగు హీరోలు ఈ వేసవి సెలవుల తర్వాత తమ కొత్త సినిమాల సెట్స్‌లోకి అడుగుపెట్ట నున్నారని తెలిసింది.