స్టార్‌ క్యాలెండర్‌ 2023: కొత్త సంవత్సరం.. కొత్త సినిమాలు

Star Calendar 2023 - Sakshi

కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సినిమా అప్‌డేట్స్‌ కోసం సినీ లవర్స్‌ ఎదురు చూస్తుంటారు. అలాగే తమ అభిమాన స్టార్‌ ఏయే సినిమాలు చేస్తున్నారో తెలుసుకోవాలని ఫ్యాన్స్‌కు ఉంటుంది. ఆ విశేషాలు ‘స్టార్‌ క్యాలెండర్‌’లో తెలుసుకుందాం.

చిరంజీవి: ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న రానున్నారు హీరో చిరంజీవి. ఇక చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బోళా శంకర్‌’ ఏప్రిల్‌ 14న రిలీజ్‌ కానుంది. మరోవైపు చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ: ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా జనవరి 12న రానున్నారు బాలకృష్ణ. ఇక అనిల్‌æ రావిపూడి దర్శకత్వంలోని సినిమాతో బిజీగా ఉంటారు.

వెంకటేశ్‌: కొన్ని కథలు విన్నప్పటికీ ఏప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ చేయలేదు. కానీ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘కీసీ కా బాయ్‌.. కీసీ కా జాన్‌’లో వెంకీ కీ రోల్‌ చేశారు. ఈ మూవీ రంజాన్‌కి రిలీజ్‌ కానుంది.

నాగార్జున: కొన్ని కథలు విన్నప్పటికీ ఇంకా ఏప్రాజెక్ట్‌కీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.

మోహన్‌బాబు: కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు ‘అగ్నినక్షత్రం’ సినిమాలో నటిస్తున్నారు. సమంత టైటిల్‌ రోల్‌ చేసిన ‘శాకుంతలం’లో మోహన్‌బాబు కీ రోల్‌ చేశారు.

రవితేజ: ఈ ఏడాది రవితేజ ఫుల్‌ బిజీ. ఇప్పటికే రవితేజ హీరోగా ‘రావణాసుర’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అలాగే ‘ఈగిల్‌’ అనే కొత్త సినిమా కమిట్‌ అయినట్లు వార్తలు ఉన్నాయి. సుధీర్‌వర్మ దర్శకత్వంలోని ‘రావణాసుర’ ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీ రోల్‌ చేసిన విషయం తెలిసిందే.

పవన్‌ కల్యాణ్‌: క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో హీరోగా టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. అలాగే ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌’ అనే సినిమా చేస్తున్నారు పవన్‌. యువ దర్శకుడు సుజిత్‌ తెరకెక్కించే  సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.

గోపీచంద్‌: దర్శకుడు శ్రీవాస్‌తో ఓ మూవీ చేస్తున్నారు గోపీచంద్‌.  దీనికి ‘లక్ష్యం 2’, ‘రామబాణం’ టైటిల్స్‌ తెరపైకి వచ్చాయి.

రాజశేఖర్‌:  పవన్‌ సాధినేని దర్శకత్వంలో గ్యాంగ్‌ స్టర్‌ ఫిల్మ్‌ ‘మాన్‌స్టర్‌’ చేస్తున్నారు రాజశేఖర్‌.

ప్రభాస్‌: ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌తోప్రాజెక్ట్‌ కె, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌’, మారుతితో ‘రాజా డీలక్స్‌’ (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) చిత్రాలు చేస్తున్నారు. అలాగే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇక ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన ‘ఆదిపురుష్‌’ పూర్తయింది. ఓం రౌత్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం జూన్‌ 16న రిలీజ్‌ కానుంది. ‘సలార్‌’ సెప్టెంబరు 28న రిలీజ్‌ కానుంది.

మహేశ్‌బాబు: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ  సినిమా రూపొందు తోంది. ఇది పూర్తి కాగానే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తారు మహేశ్‌.
ఎన్టీఆర్‌: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపుదిద్దుకోనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుంది.  

రామ్‌చరణ్‌: శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తారు చరణ్‌. అలాగే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చింది.  

అల్లు అర్జున్‌: ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చేస్తున్నారు అల్లు అర్జున్‌. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్‌  కానున్నట్లుగా తెలుస్తోంది. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ సినిమా అల్లు అర్జున్‌ కమిట్‌ అయిన సంగతి తెలిసిందే.

నాని: శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ చిత్రం చేస్తున్నారు నాని. మార్చి 30న రిలీజ్‌ కానుంది. అలాగే తన కొత్త చిత్రాన్ని నాని ఈ రోజు ప్రకటిస్తారు.

రామ్‌: ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తు న్నారు రామ్‌.
నాగచైతన్య: వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో ‘కస్టడీ’ చిత్రం చేస్తున్నారు నాగచైతన్య. ఈ సినిమా మేలో రిలీజ్‌ కానుంది. ఇక పరశురామ్‌ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

విజయ్‌ దేవరకొండ: ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకుడు. కాగా విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ‘జేజీఎమ్‌æ’ (జన  గణ మన) షూటింగ్‌ ఆరంభమైంది.  ఈ సినిమాపై  మరో అప్‌డేట్‌ రావాల్సి ఉంది.

నందమూరి కల్యాణ్‌రామ్‌: ప్రస్తుతం ‘అమిగోస్‌’, ‘డెవిల్‌’ చిత్రాలు చేస్తున్నారు కల్యాణ్‌రామ్‌. ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అమిగోస్‌’ చిత్రానికి రాజేంద్రరెడ్డి దర్శకుడు. ‘డెవిల్‌’ సినిమాకు నవీన్‌ మేడారం డైరెక్టర్‌. అలాగే కేవీ గుహన్‌తో ఓ సినిమా కమిట్‌ అయ్యారు.

శర్వానంద్‌: కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు శర్వానంద్‌.

రానా దగ్గుబాటి: దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించనున్న మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘హిరణ్యకశ్యప’లో రానా టైటిల్‌ రోల్‌ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అలాగే మిలింద్‌ రావ్‌ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

అల్లరి నరేశ్‌: ‘నాంది’ సినిమాతో తనకు మంచి హిట్‌ ఇచ్చిన దర్శకుడు విజయ్‌ కనకమేడల డైరెక్షన్‌లో అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ‘సభకు నమస్కారం’ అనే సినిమా కూడా కమిట్‌ అయ్యారు నరేశ్‌. ఈ చిత్రానికి సతీష్‌ దర్శకుడు.

నితిన్‌: వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఫిల్మ్‌ షూటింగ్‌లో నితిన్‌ పాల్గొంటున్నారు.

వరుణ్‌ తేజ్‌: దర్శకుడు ప్రవీణ్‌ సత్తారుతో ఓ యాక్షన్‌ ఫిల్మ్, కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్‌సింగ్‌తో ఎయిర్‌ఫోర్స్‌ యాక్షన్‌ బేస్డ్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌. శక్తి ప్రతాప్‌తో చేస్తున్నది వరుణ్‌కి హిందీలో తొలి సినిమా.

అఖిల్‌: సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఏజెంట్‌’తో బిజీగా ఉన్నారు అఖిల్‌.

సుధీర్‌బాబు: ‘హంట్‌’, ‘మామా మశ్చీంద్ర’ సినిమాలు చేస్తున్నారు సుధీర్‌బాబు. జనవరి 26న విడుదల కానున్న ‘హంట్‌’ మూవీకి  మహేశ్‌ సూరపనేని దర్శకత్వం వహించగా, ‘మామా మశ్చీంద్ర’ సినిమాకు హర్షవర్థన్‌ దర్శకుడు. అలాగే జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో ‘హరోం హర’ అనే సినిమా చేస్తున్నారు సుధీర్‌బాబు.

నిఖిల్‌: ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ మెగాఫోన్‌ పట్టి తెరకెక్కిస్తున్న ‘స్పై’ చిత్రంలో నటిస్తారు నిఖిల్‌. అలాగే దర్శకుడు సుధీర్‌ వర్మతోనూ నిఖిల్‌ ఓ సినిమా చేస్తున్నారు.  

సాయిధరమ్‌ తేజ్‌: సాయిధరమ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తిక్‌ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది. అదే విధంగా జయంత్‌ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు సాయిధరమ్‌ తేజ్‌.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. హిందీలో సాయి శ్రీనివాస్‌కు ఇది తొలి చిత్రం కాగా, ఈ చిత్రదర్శకుడు వీవీ వినాయక్‌కు కూడా అక్కడ దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.

వైష్ణవ్‌ తేజ్‌: కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో హీరోగా నటిస్తున్నారు వైష్ణవ్‌ తేజ్‌.

అడివి శేష్‌: తన కెరీర్‌లో వన్నాది బెస్ట్‌ హిట్స్‌గా నిలిచిన ‘గూఢచారి’ సినిమా సీక్వెల్‌ ‘గూఢచారి 2’లో నటిస్తున్నారు అడివి శేష్‌. ఈ సినిమాకు వినయ్‌ కుమార్‌ దర్శకుడు.

నాగశౌర్య: అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా చేసిన ‘ఫలానా అబ్బాయి... ఫలానా అమ్మాయి’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే ‘΄ోలీసువారి హెచ్చరిక’తో పాటు మరో సినిమా చేస్తున్నారు నాగశౌర్య.   

సందీప్‌ కిషన్‌: రంజిత్‌ జయకొడి దర్శకత్వంలో ‘మైఖేల్‌’, వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాలు చేస్తున్నారు సందీప్‌ కిషన్‌. అలాగే ధనుష్‌ హీరోగా చేస్తున్న ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రంలో ఓ కీ రోల్‌ చేస్తున్నారు.   

సిద్ధు జొన్నలగడ్డ: హిట్‌ ఫిల్మ్‌ ‘డీజే టిల్లు’ సీక్వెల్‌ ‘డీజే టిల్లు’ స్క్వైర్‌లో నటిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో రిలీజ్‌ కానుంది.  

నవీన్‌ పొలిశెట్టి: అనుష్కా శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో పి. మహేశ్‌బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అలాగే నవీన్‌ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘అనగనగా ఒక రాజు’ను కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు.
 
బెల్లంకొండ గణేష్‌: రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్‌ చేసిన ‘నేను స్టూడెంట్‌ సర్‌’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.  

వీరితోపాటు మరికొందరు హీరోలు ఆన్‌ సెట్స్‌లో బిజీగా ఉంటారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top