Stand Up Rahul Review: స్టాండప్‌ రాహుల్‌ రివ్యూ, ఎలా ఉందంటే?

Stand Up Rahul Movie Review, Rating In Telugu - Sakshi

టైటిల్‌: స్టాండప్‌ రాహుల్‌: కూర్చుంది చాలు
నటీనటులు: రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ, మురళీశర్మ, ఇంద్రజ, వెన్నెల కిషోర్‌ తదితరులు
దర్శకుడు: శాంటో మోహన్‌ వీరంకి
నిర్మాతలు: నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి
సంగీతం: స్వీకర్‌ అగస్తి
సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్‌ రవిచంద్రన్‌
రిలీజ్‌ డేట్‌: 18 మార్చి 2022

డిఫరెంట్‌ కాన్సెప్టులతో కెరీర్‌ తొలినాళ్లలో వరుస విజయాలు అందుకున్నాడు రాజ్‌తరుణ్‌. రానురానూ కథలపై పట్టు కోల్పోయిన అతడికి సక్సెస్‌ అందుకోవడం అందని ద్రాక్షే అయింది. తాజాగా స్టాండప్‌ రాహుల్‌: కూర్చుంది చాలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ యంగ్‌ హీరో. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అన్నారు. మరి నిజంగానే హీరో స్టాండప్‌ కమెడియన్‌గా ప్రేక్షకుడిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడా? వరుస అపజయాలతో కూలబడిపోయిన రాజ్‌తరుణ్‌ ఈ సినిమాతోనైనా లేచి నిలబడ్డాడా? లేదా? అనేది రివ్యూలో చూసేయండి..

కథ
స్టాండప్‌ కామెడీ అనగానే చాలామందికి ఆమధ్య వచ్చిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌లో పూజా హెగ్డే పాత్ర గుర్తుకు రావడం ఖాయం. స్టాండప్‌ కమెడియన్‌ అంటే గుండెలో కొండంత శోకాన్ని దాచుకుని ఆ విషాదాన్ని ఏమాత్రం పైకి కనిపించనీయకుండా నాలుగు జోకులు చెప్తూ ఎదుటివారిని నవ్విస్తారని దాదాపు అందరూ ఫిక్స్‌ అయ్యారు. స్టాండప్‌ రాహుల్‌లో రాజ్‌తరుణ్‌ పోషించిన పాత్ర కూడా సేమ్‌ టు సేమ్‌. రాహుల్‌(రాజ్‌ తరుణ్‌)కు స్టాండప్‌ కామెడీ అంటే ప్యాషన్‌. తండ్రి ప్రకాశ్‌(మురళీ శర్మ) మనసుకు నచ్చింది చేయమంటాడు. తల్లి ఇందు(ఇంద్రజ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయాలంటుంది. వీళ్లిద్దరూ హీరో చిన్నతనంలోనే విడిపోతారు. ఇక రాహుల్‌ తనకిష్టమైన స్టాండప్‌ కామెడీతో పాటు ఉద్యోగాన్ని కొనసాగిస్తుంటాడు.

ఈ క్రమంలో అదే ఆఫీసులో పనిచేసే శ్రేయారావు(వర్ష బొల్లమ్మ)తో అతడు ప్రేమలో పడతాడు. కానీ పెళ్లంటే గిట్టని రాహుల్‌ సహజీవనం చేద్దామంటాడు. అతడి ప్రేమను గెలవడం కోసం ఇష్టం లేకపోయినా లివ్‌ ఇన్‌ రిలేషన్‌కు సరేనంటుంది శ్రేయ. హీరో పెళ్లి మీద నమ్మకం కోల్పోవడానికి కారణం తన తల్లిదండ్రులే. ఇంతకీ రాహుల్‌ తల్లిదండ్రుల కథేంటి? వాళ్లెందుకు విడిపోయారు? హీరో ఎందుకు పెళ్లికి నిరాకరిస్తాడు? అసలు వీరి సహజీవనం పెళ్లి దాకా వెళ్లిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌ బాగుంది. కానీ దాన్ని లోతుగా ఆడియన్స్‌ కనెక్ట్‌ అ‍య్యేలా చూపించడంలో కొంత తడబడ్డాడనే చెప్పాలి. కొన్నిచోట్ల భావోద్వేగాలను మరింత పండించగలిగే అవకాశం ఉన్నా ఎందుకో దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు కనిపించింది. కథానేపథ్యం, అందుకు తగ్గట్టుగా పాత్రల్ని సృష్టించడంలో అతడి నైపుణ్యం బాగుంది. హీరో ప్యాషన్‌ స్టాండప్‌ కామెడీ అయినప్పటికీ పెద్దగా హాస్యాన్ని పండించకపోవడం గమనార్హం. మురళీ శర్మ వంటి పెద్ద నటుడిని తీసుకున్నారు కానీ ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పాత్రల మధ్య సంఘర్షణని రేకెత్తించకపోవడం మరో మైనస్‌ అనే చెప్పుకోవాలి.

ఉద్యోగం కోసం హీరో హైదరాబాద్‌కు చేరుకున్నాకే అసలు కథ మొదలువుతుంది. అతడి కుటుంబ నేపథ్యం పరిచయమయ్యాక ప్రేక్షకుడికి కథాగమనం తెలిసిపోతుంది. తర్వాత ఏం జరగబోతుందనేది ప్రేక్షకుడు ముందుగానే పసిగట్టేలా సన్నివేశాలు ఉండటంతో ఆసక్తి సన్నగిల్లుతుంది. దర్శకుడు శాంటో మోహన్‌ ఎమోషన్స్‌ మీద కూడా ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా మరో రేంజ్‌లో ఉండేదేమో!

చదవండి: రాజ్‌ తరుణ్‌, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం: వరుణ్‌ తేజ్‌

నటీనటులు
కొత్తదనాన్ని కోరుకునే రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమెడియన్‌ రాహుల్‌ పాత్రను అవలీలగా చేసేశాడు. లుక్స్‌ పరంగానే కాదు, పాత్రకు తగ్గట్టుగా ఎమోషన్స్‌లో వేరియన్స్‌ చూపించాడు. వర్ష బొల్లమ్మ తన క్యూట్‌నెస్‌తోనే కాదు, అభినయంతోనూ ఆకట్టుకుంది. సీనియర్‌ నటులు ఇంద్రజ, మురళీశర్మల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కోసమే ఆ పాత్రలు డిజైన్‌ చేసినట్లుగా నటించారు. వెన్నెల కిశోర్‌ కామెడీ బాగుంది. సాంకేతికంగా సినిమా మెప్పించింది. శ్రీరాజ్‌ రవిచంద్రన్‌ కెమెరాతో జిమ్మిక్కులు చేశాడు. స్వీకర్‌ అగస్త్య మంచి సంగీతం అందించాడు. డైరెక్టర్‌ శాంటోకి ఇది ఫస్ట్‌ మూవీ అయినప్పటికీ అనుభవమున్నవాడిలా తెరకెక్కించాడు. కాకపోతే కాన్సెప్ట్‌ మీద దృష్టి పెట్టిన అతడు సంఘర్షణ, భావోద్వేగాల మీద ఫోకస్‌ చేయలేకపోయాడు.

ప్లస్‌
రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ
► సంగీతం
► సినిమాటోగ్రఫీ

మైనస్‌లు
బలమైన ఎమోషన్స్‌ లేకపోవవడం
బలహీనమైన పాత్రలు

కొసమెరుపు: స్టాండప్‌ రాహుల్‌.. కూర్చున్నా, లేచినా పెద్ద తేడా లేదు!

Rating:  
(2.25/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top