‘‘సుందరకాండ’ మంచి వినోదాత్మక చిత్రం. కథ వినగానే షాక్ అయ్యాను. ఈ చిత్రంలో నేను చాలా మంచి బలమైనపాత్ర చేశాను. అందరూ థియేటర్స్‌కి వెళ్లిచూడొచ్చు’’ అని హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్ తెలిపారు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘సుందరకాండ’. శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లుగా నటించారు.
సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీదేవి విజయ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై నన్ను నేను చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకుని, ఓపాపకి జన్మనిచ్చాను. ఆ తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు నా కుమర్తె స్కూల్‌కు వెళుతోంది. సో.. నేను మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాను.
ఈ సినిమాలో నేను స్కూల్ డ్రెస్‌లో కనిపించే సన్నివేశం ఉంది. ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. డైట్ ఫాలో అయ్యాను. నా కుమార్తె, నేను స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.. ఇవి నాకు మంచి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ప్రభాస్‌గారి తొలి సినిమా ‘ఈశ్వర్’లో నేను హీరోయిన్ గా చేశాను.. తను పెద్ద స్టార్ అవుతాడని మేం అప్పుడే ఊహించాం.. మేం ఊహించినదాని కన్నా పెద్ద స్టార్ అయ్యారు’’ అని చెప్పారు.


