
దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల కొన్ని దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించింది. వెండితెరపై తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. కానీ ఊహించని విధంగా 2018లోనే ఓ హోటల్‌లో మరణించింది. ఆమె చివరిసారిగా నటించిన చిత్రం మామ్. ఆమె భర్త బోనీ కపూర్ నిర్మాతగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బోనీ కపూర్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మామ్ కోసం శ్రీదేవి చాలా కష్టపడిందని అన్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వర్షన్స్‌కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుందని తెలిపారు. ఈ మూవీ కోసం తన రెమ్యునరేషన్ సైతం వదులుకుందని వెల్లడించారు.
బోనీ మాట్లాడుతూ.. "మామ్ షూటింగ్ సమయంలో మేము ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. కానీ అతనికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంత ఖర్చు మేం భరించలేకపోయా. శ్రీదేవి రెమ్యునరేషన్ కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టాం. కానీ ఆమె నాకు బ్యాలెన్స్ డబ్బులేవీ వద్దు. ఆ మిగిలిన మొత్తం రూ.70 లక్షలు రెహమాన్‌కు ఇచ్చిన తీసుకురావాలని చెప్పిందని' గుర్తు చేసుకున్నారు.
అంతేకాకుండా మామ్ షూటింగ్ సమయంలో తనతో గది పంచుకోవడానికి కూడా శ్రీదేవి నిరాకరించిందని బోనీ కపూర్ వెల్లడించారు. సినిమా పట్ల అంత నిబద్ధతగా పనిచేసిందని తెలిపారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో.. ఆ తర్వాత జార్జియాలో చిత్రీకరించామన్నారు. సినిమా షూటింగ్ మొత్తం కాలంలో శ్రీదేవి ఎప్పుడూ గది పంచుకోలేదని వివరించారు. తన మైండ్‌సెట్ డైవర్ట్ కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆమె ఆ పాత్ర పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిందని పంచుకున్నారు.
కాగా.. ఇటీవల ఐఫా రజతోత్సవ వేడుకల సందర్భంగా బోనీ కపూర్.. మామ్ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు. ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశముందని బోనీ అన్నారు. కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కూడా నటించారు. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.175 కోట్లు వసూలుచేసింది.