
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశామా? దక్షిణాదితో పాటు హిందీలోనే రిలీజ్ చేద్దామా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. రూ.1000 కోట్ల కలెక్షన్ అందుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ మార్క్‌ని తెలుగు చిత్రాలు ఇదివరకే అందుకోగా, 'కేజీఎఫ్'తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఈ ఫీట్ సాధించేసింది. కానీ తమిళ పరిశ్రమకు మాత్రం అది అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.
గత నెలలో వచ్చిన 'కూలీ' కూడా ఈ మార్క్ అందుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. రిలీజ్‌కి ముందు ఆ రేంజ్ హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ అంతంత మాత్రమే ఉండేసరికి రూ.400-500 కోట్ల వసూళ్ల వరకు వచ్చి ఆగిపోయింది. అయితే తమిళ మూవీస్ అసలు రూ.1000 కోట్ల మార్క్ ఎందుకు చేరుకోలేకపోతున్నాయ్ అనే విషయమై హీరో శివకార్తికేయన్ ఇప్పుడు మాట్లాడాడు. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: అల్లు కుటుంబానికి GHMC షాక్)
'తమిళ సినిమా ఆ నంబర్‌కి చేరువలో ఉంది. మరికొన్నేళ్లలో రూ.1000 కోట్ల కలెక్షన్ ఫీట్ సాధిస్తుందని నమ్మతున్నాను. చాలా తమిళ సినిమాలు ఈ మార్క్‌ని అందుకోలేకపోతున్నాయి. స్టోరీలో సత్తా లేకపోవడమో లేదా పాన్ ఇండియా సబ్జెక్ట్ కాకపోవడం వల్లనే దీనికి కారణం. మూవీ క్వాలిటీ సంగతి పక్కనబెడితే టికెట్ రేట్లు కూడా తమిళనాడులో చాలా తక్కువ. బెంగళూరు, ముంబైలో ఉన్నట్లు ఇక్కడా ఉంటే 'జైలర్'కి రూ.800-1000 కోట్లు వచ్చి ఉండేవి. అలా అని టికెట్ రేట్లు పెంచమని నా ఉద్దేశం కాదు. మా సినిమాలు.. ఉత్తరాది ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాల్సిన అవసరముంది' అని శివకార్తికేయన్ అన్నాడు.
ఇతడు చెప్పిన దానిలో కొంత నిజముంది. బెంగళూరు, ముంబై సంగతి పక్కనబెడితే హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్‌లో టికెట్ రేటు రూ.250-300 ఉంటే.. అదే సంస్థకు చెందిన చెన్నై మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ.180 మాత్రమే. అలానే తమిళ సినిమాల్లో ఎక్కువగా ప్రాంతీయత అనే అంశం కనిపిస్తుంది. అందుకే కొన్ని చిత్రాలు తమిళనాడులో తప్పితే మరో చోట ఆడవు. ఓవరాల్ అప్పీల్ ఉన్న మూవీస్ వచ్చినప్పుడు బహుశా తమిళ చిత్రం రూ.1000 కోట్ల మార్క్ అందుకోవచ్చేమో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)