
టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన మెప్పించిన బ్యూటీ శ్రియా శరణ్. ఆ తర్వాత రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. తాజాగా మరోసారి మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న శ్రియా శరణ్ తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆండ్రీ కోస్చీవ్‌తో తన ప్రేమకథ గురించి శ్రియ శరణ్ ఓపెన్ అయింది. ఆండ్రీని మొదటిసారి కలిసేందుకు మాల్దీవులకు వెళ్లానని శ్రియా పంచుకుంది. అయితే ఫస్ట్ మీట్ కావడంతో టెన్షన్‌లో రాంగ్ ఫ్లైట్ బుక్ చేశానని తెలిపింది.
శ్రియా మాట్లాడుతూ.. "నా డైవింగ్ ట్రిప్ ఏప్రిల్‌లో ఉంది. కానీ మార్చిలో నేను మాల్దీవులకు వెళ్లాను. అక్కడ దిగినప్పుడు చాలా పెద్ద తప్పు చేశానని గ్రహించా. అక్కడ నేను ఒంటరిగా ఉన్నా. ఆ సాయంత్రం ఒక పడవ మాల్దీవులకు దక్షిణంగా వెళుతోందని నాకు తెలిసి అందులో వెళ్లా. అదొక అందమైన సూర్యాస్తమయం. అక్కడ నాకు ఎవరు తెలిసినవారు లేకపోవడంతో ఒంటరిగా ఉన్నా. భయపడి డెక్ మీద నిలబడి ఉన్నా. అదే సమయంలో తిరిగి చూడగానే ఆండ్రీ నా వెనకే ఉన్నాడు. అలా మేము మొదటిసారి కలుసుకున్నాం" అని గుర్తు చేసుకుంది.
అయితే తన సినిమా దృశ్యం చూసిన తర్వాత ఆండీ కోస్చీవ్ నన్ను చూసి భయపడ్డాడని వెల్లడించింది. ఆండ్రీకి, తనకు మొదట్లో ఒకరి గురించి ఒకరు ఏమీ తెలియదని.. అయినా మా రిలేషన్ చాలా అందంగా అనిపించిందని శ్రియ తెలిపింది. అలా డైవింగ్‌కు వెళ్లామని.. మాట్లాడుకుంటూనే మా ఇద్దరి మధ్య డేటింగ్ ప్రారంభమైందని పంచుకుంది. తాను మొదట రష్యన్ భాషలో చెడు పదాలు నేర్చుకున్నానని శ్రియ శరణ్ చెప్పింది. కానీ ఇప్పుడు తన కుమార్తె రాధా శరణ్ కోస్చీవ్‌తో కలిసి భాషను సరిగ్గా నేర్చుకుంటున్నానని నవ్వుతూ మాట్లాడింది. అంతేకాకుడా ఆండ్రీకి హిందీ బాగా అర్థమవుతుంది.. అదృష్టవశాత్తూ ఆండ్రీ భారతదేశానికి వచ్చాడని పేర్కొంది. కాగా.. శ్రియా శరణ్ 2018లో ఆండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.