
‘దసరా’ విలన్ షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఈ మధ్య వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలు, కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదం..ఆ ప్రమాదంలో తండ్రి మరణించడం.. ఇవన్నీ చాకోని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకే కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. గతంలో చేసిన తప్ప్పులను సరిదిద్దుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో తన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డ నటి విన్సీసోనీ అలోషియన్(Vincy Aloshious)కి తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలంటూ మీడియా ముందే ఆమెను కోరారు. చాకో చెప్పిన సారీని విన్సీ అంగీకరించడంతో వివాదానికి ఎండ్ కార్డు పడింది.
సూత్రధారి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆ మధ్య విన్సీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మలయాళ ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇదే సినిమా ప్రచారం కోసం వచ్చిన చాకో.. అందరి ముందే విన్సీకి క్షమాపణలు చెప్పాడు.
‘నేను కావాలని మీతో ఇబ్బందికరంగా ప్రవర్తించలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను సరదాగా చెప్పానంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. నా ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడినందుకు క్షమించాలి’ అని కోరగా.. పక్కనే ఉన్న విన్సీ మైక్ తీసుకొని ‘ఆ సమయంలో ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆయన నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. నేను స్పందించిన తీరు ఆయన కుటుంబాన్ని కూడా ఎంతో బాధించింది. ఇప్పుడు ఆయనలో మార్పు కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్నాడు. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అని పేర్కొంది.
విన్సీ క్షమించడంతో చాకోకు ఒక పెద్ద రిలీఫ్ లభించినట్లు అయింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుతో ఇబ్బంది పడుతున్న చాకో.. సారీ చెప్పి మంచి పనే చేశాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సినిమా షూటింగ్‌లో అయితే వివాదం చెలరేగిందో.. అదే సినిమా ఈవెంట్‌లో దాన్ని పరిష్కరించుకొని ఒక సమస్యను తగ్గించుకున్నాడు.