మొదటి ఫోన్‌  చరణ్‌ నుంచే వచ్చింది: శర్వానంద్‌‌

Sharwanand Comments On Sreekaram​ Movie - Sakshi

‘‘శ్రీకారం’ కథ విన్నప్పుడు ఒక బాధ్యతగా ఈ సినిమా చేయాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నా’’ అని శర్వానంద్‌ అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌ హీరో హీరోయిన్లుగా కిశోర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీకారం’. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘మాది రైతు కుటుంబమే. లాక్‌డౌన్‌ లో ఓ మూడు నెలలు నేను మా పొలం దగ్గరే గడిపాను. ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్‌కాల్‌ నాకు చరణ్‌ (హీరో రామ్‌చరణ్‌) నుంచి వచ్చింది. వ్యవసాయాన్ని చులకనగా చూస్తున్నారు. చదువుకున్నవారు వ్యవసాయం చేస్తే టెక్నాలజీని ఊపయోగించి మరింత బాగా చేస్తారు’’ అని అన్నారు.

‘‘ప్రతి ఒక్కరూ తమ కథను తాము స్క్రీన్‌  పై చూసుకుంటున్నట్లుగా ఫీలై థియేటర్స్‌ నుంచి బయటకు వస్తారు’’ అని దర్శక, రచయిత కిశోర్‌ అన్నారు. ‘‘డైలాగ్స్‌ పెద్ద ఎస్సెట్‌. దర్శకుడిగా కిశోర్‌కు మంచి భవిష్యత్తు ఉంది’’ అని నిర్మాత గోపీ అన్నారు. ‘‘మంచి కథలనే ఎంచుకునే ఓ అరుదైన నటుడు శర్వానంద్‌. భూమికీ, మనిషికీ మధ్య ఉన్న ప్రేమకథే ‘శ్రీకారం’ సినిమా. ఈ భూమి మీద పైసా కూడా దోచుకోలేనిది ఒక్క రైతు మాత్రమే’’ అని అన్నారు డైలాగ్‌ రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా. ‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో వెళ్లి ఈ సినిమాను చూడండి’’ అన్నారు ప్రియాంకా అరుళ్‌ మోహనన్‌. 

Election 2024

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top