
మొగలిరేకులు.. అప్పట్లో ఈ సీరియల్ ఒక సెన్సేషన్. ఇందులో పోలీసాఫీసర్ ఆర్కే నాయుడిగా నటించి బుల్లితెర హీరో అయ్యాడు నటుడు సాగర్. అప్పటికే చక్రవాకం ధారావాహికతోనూ బోలెడంత పాపులర్ అయ్యాడు. ఈ ఫేమ్ వల్ల సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అలా మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా చేశానని, కానీ రంగస్థలం వదిలేసుకున్నానని చెప్తున్నాడు.
నేను చేసిన తప్పు
ఆర్కే సాగర్ (R.K. Sagar) హీరోగా నటించిన తాజా చిత్రం ది 100. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూలై 11న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు సాగర్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా లైఫ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా చేయడం నేను చేసిన తప్పు. మొగలిరేకులు సీరియల్ పీక్స్‌లో ఉన్నప్పుడు మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీ (Mr Perfect Movie)లో ఛాన్స్ వచ్చింది.
15 రోజులు డేట్స్ ఇచ్చా..
అందులో సెకండ్ లీడ్ నాదే అన్నారు. పెద్ద బ్యానర్ అని ఒప్పుకున్నాను. అప్పటివరకు నాకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. సీరియల్ టీమ్‌ను ఎలాగోలా ఒప్పించి మిస్టర్ పర్‌ఫెక్ట్ టీమ్‌కు 15 రోజులు డేట్స్ ఇచ్చాను. మొదటి మూడురోజులు నాకు షూటింగ్ లేదు. అనుమానం వచ్చి డైరెక్టర్ దశరథ్‌ను అడిగితే రేపు నీ సీన్ ఉంటుందన్నాడు. అలా నాపై రెండు మూడు సీన్లు తీశారు.
చాలా డిసప్పాయింటయ్యా
సెకండ్ లీడ్ అని వెళ్తే.. అక్కడంతా రివర్స్‌లో జరుగుతోందనిపించింది. నాకు చెప్పిన క్యారెక్టర్ ఇది కాదు కదా అనిపించింది. అదే విషయం నిలదీశాను. అసలు నాది సెకండ్ లీడేనా? అని అడిగాను. అందుకాయన.. అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారుతుంటాయి. అర్థం చేసుకోండి అన్నారు. చాలా నిరాశచెందాను. నేను చేయాలనుకుంది ఇది కాదు కదా అనిపించి బయటకు వచ్చేశాను.
నా సీన్లు లేపేయమన్నా
నా సీన్లు తీసేయమన్నాను. ఎందుకంటే డబ్బు కోసం సినిమా చేయట్లేదు, వెండితెరపై నా ఎంట్రీ బాగుండాలని చేశానంతే! నా క్యారెక్టర్‌ను తీసేసి వేరే పాత్రను హైలైట్ చేసుకోండి అని చెప్పాను. అయినప్పటికీ సినిమాలో నా రోల్ అలాగే ఉంచారు. ఆ సినిమా ఇంపాక్ట్ నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఆ మూవీ రిలీజయ్యాక చాలామంది అలాంటి రోల్ చేశావేంటి? అని అడిగారు. అప్పుడే మంచి సినిమాలు చేయాలని డిసైడయ్యాను.
రంగస్థలం రిజెక్ట్ చేశా..
రంగస్థలం మూవీలోనూ ఆఫర్ వచ్చింది. కానీ మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా దెబ్బతో మళ్లీ నా పాత్రను ఎటు తిప్పుతారో ఏంటోనని భయపడి వెనకడుగు వేశాను. ఆ తర్వాత హీరో ఆదిగారిని సంప్రదించారని తెలిసింది. ఆయన కూడా ఒప్పుకోలేదు. కొద్దిరోజులకు ఇద్దరం ఒకేసారి ఒప్పుకున్నాం. అప్పటికే ఆది.. సుకుమార్‌కు ఫోన్ చేసి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తనను సెలక్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు.
చదవండి: హీరోయిన్‌తో అసభ్యకర ప్రవర్తన.. క్షమాపణలు చెప్పిన దసరా విలన్