
హీరో హీరోయిన్లు ఆన్‌స్క్రీన్ రొమాన్స్ బాగా పండిస్తే సినిమా విజయానికి అది దోహదం చేయవచ్చు. కానీ... అదే హీరో/ హీరోయిన్‌లకు అప్పటికే పెళ్లయి ఉంటే..ఆ పెళ్లికి అది పెనుముప్పుగా మారవచ్చు. ఇప్పుడు పెళ్లయిన నటీనటులు సినిమాల్లో రొమాన్స్ పండించడం వాటిని చూస్తూ కూడా సదరు నటీనటుల భార్య/భర్త ప్రొఫెషనల్‌గా మాత్రమే తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయి ఉండవచ్చు కానీ ఒకప్పుడు అది అంత సులభమైన విషయం కాదు. అదే పరిస్థితిని ఎదుర్కుంది అలనాటి ఒక సినిమా జంట.
దాదాపు ఏభైఏళ్ల క్రితం అంటే, 1970ల చివరలో, బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశమైన ఆన్‌స్క్రీన్ జోడీగా పేరొందారు అమితాబ్ బచ్చన్ అలనాటి దక్షిణాది బ్యూటీ క్వీన్ రేఖ. వీరి గురించి గుసగుసలు కూడా పరస్పరం గుసగుసలాడాయి అన్నంతగా వార్తలు వ్యాపించాయి. వారిద్దరి మధ్యా పండిన అద్భుతమైన కెమిస్ట్రీ వెండితెరను వెలిగించింది ఆ గాఢమైన అనుబంధం వెనుక నటన మాత్రమే కాదు అంతకు మించి అని అభిమానులను కూడా నమ్మించింది.
కానీ పుకార్లు తమ చుట్టూ తిరుగుతుండగా, అప్పుడూ ఎప్పుడూ అమితాబ్ మౌనంగానే ఉన్నారు. మరోవైపు, సీనియర్ నటి రేఖ మాత్రం తరచు వాస్తవాలు మాట్లాడుతూ వస్తున్నారు. తమ కథలోని అత్యంత నాటకీయ భావోద్వేగ క్షణాలలో ఒకటి 1978 బ్లాక్‌బస్టర్ ’ముకద్దర్ కా సికందర్’ విడుదల సమయంలో జరిగిందని రేఖ ఇటీవల చెప్పారు. .
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రేఖ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించింది. ’ముకద్దర్ కా సికందర్’ విడుదలకు ముందుగా ఆ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించారని, ఆ సమయంలో ఆ స్క్రీనింగ్ చూడడం కోసం అమితాబ్ బచ్చన్ కుటుంబం వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. వారిని తాను ప్రొజెక్షన్ రూమ్‌లో నుంచి గమనిస్తూ ఉండిపోయానని తెలిపింది. ‘‘’ముకద్దర్ కా సికందర్’ ట్రయల్ షో చూడటానికి వచ్చిన బచ్చన్ కుటుంబాన్ని ప్రొజెక్షన్ రూమ్‌లో నుంచి చూస్తూ ఉన్నా. జయ ముందు వరుసలో కూర్చుంది. అతను (అమితాబ్) అతని తల్లిదండ్రులు ఆమె వెనుక వరుసలో ఉన్నారు. వారు ఆమెను నేను చూడగలిగినంత స్పష్టంగా చూడలేకపోయారు. ఆ సమయంలో నేను గమనించాను. అమితాబ్ నాకు (రేఖ) మధ్య మా ప్రేమ సన్నివేశాలు వస్తున్న సమయంలో, ఆమె ముఖం కన్నీటితో తడిసిపోవడం నేను చూడగలిగాను.

ఒక వారం తర్వాత, పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు. అతను నాతో కలిసి పనిచేయబోనని తన నిర్మాతలకు స్పష్టం చేశాడని. ఈ నిర్ణయం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఎందుకంటే అమితాబ్ రేఖ కలిసి పరిశ్రమకు అనేక విజయాలను అందించారు వారి జంటను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డారు.
ఏదైతేనేం.. ’ముకద్దర్ కా సికందర్’ తర్వాత, 1981లో వచ్చిన ఏకైక ’సిల్సిలా’ సినిమా వరకు వారు మళ్ళీ కలిసి కనిపించలేదు, ఈ సినిమా వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరుగుతున్న పుకార్లకు అద్దం పట్టింది. తన పట్ల అమితాబ్ కుటుంబం ఎప్పుడు ఎలా స్పందించినా, ఎల్లప్పుడూ జయ గురించి మాత్రం రేఖ గౌరవంగానే మాట్లాడింది, తామిద్దరి మధ్య శత్రుత్వం లేదా ద్వేషం అంటూ వచ్చిన వార్తలను కథలను తోసిపుచ్చింది.
గత 1990లలో ఒక ఇంటర్వ్యూలో, రేఖ జయ గురించి తన భావాలను చాలా స్పష్టంగా చెప్పింది. ‘దీదీభాయ్ (జయ) చాలా పరిణతి చెందినది, చాలా కలుపుగోలు మనిషి. నేను ఇంతగా కలిసిపోయే మరో మహిళని చూడలేదు. ఆమె గౌరవించదగ్గ వ్యక్తి. ఆమెకు చాలా బలం ఉంది. నేను ఆమెని ఆరాధిస్తాను.‘ అంటూ చెప్పడం దీనికి నిదర్శనం. విశేషం ఏమిటంటే... 1981లో ‘సిల్సిల’ తర్వాత, అమితాబ్ రేఖ మళ్లీ కలిసి నటించలేదు.