Red Notice Movie Telugu Review: ముగ్గురు హాలీవుడ్‌ స్టార్‌ల 'రెడ్‌ నోటీస్‌' ఎలా ఉందంటే..!

Red Notice Hollywood Movie Telugu Review - Sakshi

టైటిల్‌: రెడ్‌ నోటీస్
నటీనటులు: డ‍్వేన్‌ జాన్సన్‌, ర్యాన్‌ రెనాల్డ్స్‌, గాల్‌ గాడోట్‌, రితు ఆర్య
కథ, దర్శకత్వం: రాసన్‌ మార్షల్‌ థర్బర్‌
సంగీత దర్శకుడు: స్టీవ్‌ జాబ్లోన్‌స్కీ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

దొంగతనం నేపథ్యంలో వచ్చే సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. స్టైలిష్‌గా దొంగతనం చేయడం, పోలీసుల చేజింగ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. బాలీవుడ్‌లో వచ్చిన 'ధూమ్' సిరీస్‌ నుంచి రీసెంట్‌గా హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ 'మనీ హీస్ట్‌' వరకు ఆసక్తికరంగా ఉండేది ఈ అంశాలే. ఈ కథాంశంగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం 'రెడ్‌ నోటీస్‌'. ది రాక్‌ డ్వేన్‌ జాన్సన్‌, డెడ్‌పూల్‌ ర్యాన్‌ రెనాల్డ్స్‌, వండర్ వుమెన్‌ గాల్‌ గాడోట్‌ వంటి హాలీవుడ్‌ స్టార్‌లతో రూపొందిందీ చిత్రం. 160 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మరి ఎంతవరకు సక్సెస్‌ అయిందో చూద్దామా..!

కథ: 

ఈజిప్ట్‌ రాణి అయిన క్లియోపాత్ర వివాహానికి తన తండ్రి పెళ్లి బహుమతిగా 3 ఎగ్స్‌ని ఇస్తాడు. కొంత కాలం తర్వాత ఆ 3 ఎగ్స్‌ మూడు  వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ఎగ్స్‌ను కొట్టేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్స్‌ (కళాఖండాలు) దొంగలుగా పేరొందిన బిషప్‌ (గాల్‌ గాడోట్‌), నోలన్‌ బూత్‌ (ర్యాన్‌ రెనాల్డ్‌) ఏ విధంగా కష్టపడ్డారు. ఎలా ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేశారు. వారికి ఎవరెవరూ సహాయం చేశారు.  ఈ దొంగతనాన్ని ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్‌ జాన్‌ హార్ట్లీ (డ్వేన్‌ జాన్సన్‌) ఎలా అ‍డ్డుకున్నాడు? వారితో ఎందుకు చేతులు కలిపి పని చేయాల్సి వచ్చింది ? అనేదే 'రెడ్ నోటీస్' కథ.

విశ్లేషణ: 

ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ ఆర్ట్స్‌ దొంగ అయిన నోలన్‌ బూత్‌ (ర్యాన్‌ రెనాల్డ్‌)ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. సినిమా ప్రారంభంలోనే ర్యాన్‌ రేనాల్డ్స్‌, డ్వేన్‌ జాన్సన్‌ మధ్య మంచి చేజింగ్‌, యాక్షన్ సీన్లు వస్తాయి. ఈ సీన్లతో స్టోరీలోకి నిమగ్నమవుతారు ప్రేక్షకులు. ప్రారంభంలోనే కాకుండా సినిమాలో వచ్చిన యాక్షన్‌ సీన్స్‌, అడ్వెంచర్స్‌ ఆకట్టుకుంటాయి. చిత్రాన్ని కేవలం యాక్షన్‌, చేజింగ్‌ సీన్స్‌తోనే కాకుండా కామెడీ ఎంటర్‌టైనర్‌గా కూడా రూపొందించారు డైరెక్టర్‌ రాసన్ మార్షల్‌ థర్బర్‌. ఈ దర్శకుడు ఈజీ ఏ, డ్వేన్‌ జాన్సన్‌తో స్కై స్క్రాపర్‌, డాడ్జ్‌బాల్‌ వంటి సినిమాలను తెరకెక్కించారు. సినిమాను ఏదో కొత్త తరహా అడ్వెంచర్‌గా ఉండదు.  కానీ దొంగతనం నేపథ్యంతోనే యాక్షన్‌, అ‍డ్వెంచర్స్‌తోపాటు కమర్షియల్‌గా తెరకెక్కించారు దర్శకుడు రాసన్. 

సినిమాలో యాక్షన్స్, అడ్వెంచర్స్‌తో పాటు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అద్బుతంగా ఉంది. ముగ్గురు స్టార్‌లను పెట్టి తీసిన డైరెక్టర్‌ మార్షల్‌ నిజంగా సక్సెస్ అయ‍్యారనే చెప్పొచ్చు. గాల్‌ గాడోట్‌, ర్యాన్ రెనాల్డ్స్‌, డ్వేన్‌ జాన‍్సన్‌ ముగ్గురు కనిపించే ప్రతీ ఫ్రేమ్‌ సూపర్‌గా ఉంటుంది. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, కోఆర్డీనేషన్‌ అదిరిపోయింది. సినిమా ఆద్యంతం ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. అలాగే చిత్రంలోని విజువల్స్‌ చాలా బాగున‍్నాయి. రెడ్‌ నోటీస్‌ నవంబర్ 5న థియేటర్లలో రిలీజ్‌ కాగా, నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం చివర్లో సీక్వెల్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చూపించారు. 

ఎవరెలా చేశారంటే..?

ముందుగా ర్యాన్ రెనాల్డ్స్‌ గురించి మాట్లాడుకుంటే తనదైనా కామెడీ టైమింగ్‌తో సినిమా మొత్తం ఎంటర్‌టైన్‌ చేస్తాడు. యాక్షన్ సీన్స్‌తోపాటు జైలులో నుంచి తప్పించుకునేందుకే చేసే పనులు ఆకట్టుకుంటాయి. తాను ఉన్న ప్రతీ ఫ్రేమ్‌ వినోదభరితంగా ఉంటుంది. సినిమా బోర్‌  కొట‍్టకుండా ఉండేందుకు తను ప్రధాన కారణమని చెప‍్పకతప్పదు. ఇక వండర్‌ వుమెన్‌ గాల్‌ గాడోట్‌ తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కేవలం అందంతోనే కాకుండా తెలివైన దొంగగా, యాక్షన్ సీన్లలో అదరగొడుతుంది. గాల్‌ గాడోట్‌పై అంచనాలతో చూస్తే తను మిమ్మల్ని కచ్చితంగా నిరాశపరచదు. ఇక గాల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్స్‌ ముగ్గురు చేసే యాక్షన్‌ సీన్స్‌ వావ్‌ అనిపిస్తాయి. ది రాక్‌ డ్వేన్‌ జాన్సన్‌పై మాములుగానే ఎన్నో అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా తనదైన సెటిల్డ్‌ పెర్మాఫెన్స్‌ ఇచ్చి ఆకట్టుకున్నారు జాన్సన్‌. 
చదవండి: ఇండియన్‌ ఫుడ్‌ అంటే ఇష్టమంటున్న 'వండర్‌ వుమెన్‌'

Read latest Reviews News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top