'రమణి కళ్యాణం' మూవీ రివ్యూ | Ramani Kalyanam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

'రమణి కళ్యాణం' మూవీ రివ్యూ

May 22 2026 8:09 AM | Updated on May 23 2026 12:43 PM

Ramani Kalyanam Movie Review And Rating In Telugu

టైటిల్‌: రమణి కళ్యాణం 
నటీనటులు: సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, యాంకర్ శ్యామల.. తదితరులు
నిర్మాణ సంస్థ: కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్
నిర్మాతలు: విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల
రచన & దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి
డైలాగ్స్ : రామ్ జగదీశ్ 
సినిమాటోగ్రఫీ : అరవింద్ తిరుకోవెల 
సంగీతం : సూరజ్ S కురుప్ 
ఎడిటర్ : రవితేజ గిరజాల 
విడుదల తేది: మే 22, 2026

ట్రైలర్, టీజర్స్ చూడగానే నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి మధ్య ప్రేమకథ అని తెలిసి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్ కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే.. 
ఎప్పుడో గతంలో ఇలా హీరో హీరోయిన్స్ కి ఆరోగ్య సమస్యలు ఉండటం, వాళ్ళ పేమకథలతో సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలైంది. మనలో ఏ లోపం ఉన్నా జీవితంలో ముందుకు వెళ్లడానికి అది అడ్డంకిగా మారకూడదు అనే పాయింట్ ని ఓ ప్రేమకథగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్స్ పాత్రల పరిచయం, వాళ్ళ స్నేహం, ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్ కి ఓ ఎమోషనల్ సీన్ తో నెక్స్ట్ కిషోర్ ఏం చేస్తాడు అనే ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. ఈ సినిమాకి హీరోయిన్ పాత్రనే బాగా హైలెట్ చేసారు. తను అసలు బ్లైండ్ అనే విషయం మర్చిపోయి ధీమాగా బతుకుతుంది. తన యాక్సిడెంట్ వల్ల అసలు కారు ఎక్కదు. దాని గురించి గొడవే జరుగుతుంది. అలాంటిది ఆ భయం నుంచి ఎలా బయటపడింది తన ట్రామాకు సంబంధించిన సీన్స్ అన్ని బాగానే రాసుకున్నారు.

మధ్యమధ్యలో కామెడీ ట్రై చేసారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ ఆర్జేగా మారడం ఓకే కానీ, ఆ ఆర్జే సీన్స్, ఆఫీసులో కిరాక్ సీతతో అక్కర్లేని సీన్స్ తో సాగదీశారు. అసలు కిరాక్ సీత పాత్ర ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. హీరో ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంది. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మనం ఊహించం. అయితే క్లైమాక్స్ మాత్రం రొటీన్ పాత సినిమాల్లో లాగా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేసారు. ఆ క్లైమాక్స్ ఇంటర్వెల్ సమయంలోనే ఊహించేయొచ్చు.

ఇక హీరోయిన్ తో ఉండే ఆ నలుగురు పిల్లలు ఎవరు, ఆ బామ్మ ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రేమకథలో ఎమోషన్ ఇంకాస్తా పండాల్సింది. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయితో డ్రీమ్ సాంగ్స్ వేయడం ఇబ్బందిగా ఉండటమే కాక కథకు అడ్డంగా కూడా ఉంటుంది. ఇక ఈ సినిమా ఓ రెండు మూడేళ్ళ క్రితం షూటింగ్ జరుపుకున్న సినిమా అని అందులో ఉన్న కొంతమంది ఆర్టిస్టులను చూస్తే తెలిసిపోతుంది. హీరో హీరోయిన్స్ కి లోపాలు పెట్టి వల్ల మధ్య ప్రేమకథతో దర్శకుడు ఏదో మోటివేషనల్ మెసేజ్ ఇద్దామనుకున్నట్టు ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..
దీప్షిక చంద్రన్ మాత్రం కళ్ళు లేని అమ్మాయి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సూర్య వశిష్ట కూడా సినిమా అంతా వీల్ చైర్ లోనే ఉండి బాగానే నటించాడు. ఎప్పుడూ నవ్వించే శ్రీనివాస రెడ్డి ఈసారి ఎమోషనల్ పాత్రలో మెప్పించాడు. లోహిత్ కుమార్, ప్రభావతి, చైతన్య జొన్నలగడ్డ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా పాటలు అంతగా మెప్పించవు. ఎడిటింగ్ లో అక్కర్లేని సాంగ్, కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది. దర్శకుడు ఓ మోటివేషనల్ రాసుకున్న ప్రేమకథని ఇంకాస్త ఎమోషనల్ గా తెరకెక్కించాల్సింది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement