రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు? | Ram Charan Drops Global Star Tag, It Is Lession For Tollywood Stars | Sakshi
Sakshi News home page

‘గ్లోబల్‌ స్టార్‌’ నేర్పుతున్న పాఠం.. టాలీవుడ్‌ ట్యాగ్‌ పిచ్చోళ్లకు వినపడుతోందా?

Nov 5 2025 7:06 PM | Updated on Nov 5 2025 8:26 PM

Ram Charan Drops Global Star Tag, It Is Lession For Tollywood Stars

అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు మన తెలుగు హీరోలకు మొదటి నుంచీ తమ పేర్ల కన్నా వాటి ముందు తగిలించుకునే ట్యాగ్స్‌ పిచ్చి ఎక్కువ. తాజాగా రామ్‌ చరణ్‌  గ్లోబల్‌ స్టార్‌ అంటూ తాను తగిలించుకున్న ట్యాగ్‌ను స్వఛ్చందంగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమా సర్కిల్‌లోనూ అటు సోషల్‌ మీడియాలోను రామ్‌ చరణ్‌ ను గ్లోబల్‌ స్టార్‌ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్‌. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్‌ స్టార్‌ ట్యాగ్‌ ను తొలగించారని సమాచారం.  లేటెస్ట్‌ గా వస్తున్న పోస్టర్‌ లోను గ్లోబల్‌ స్టార్‌  తొలగించి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గా పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు హీరోల ట్యాగ్‌ పిచ్చి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్‌ హీరోలు అదనపు స్టార్‌ ట్యాగ్‌ లను తగిలించుకోవడం ఎలాగైతే మొదటి సారి కాదో  అలాగే వదిలించుకోవడం కూడా ఇదే ప్రధమం కాదు.  గతంలో ఎన్టీఆర్‌ హీరోగా మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌ లో వచ్చిన శక్తి సినిమా టైమ్‌ లో ఏ1 స్టార్‌ అనే ట్యాగ్‌ ను ఎన్టీయార్‌ తగిలించుకున్నారు. అయితే ఆ సినిమా దారుణంగా ప్లాప్‌ అవడంతో  మేల్కొన్న తారక్‌ మరోసారి ఆ ట్యాగ్‌ ను యూజ్‌ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత గ్లోబల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ను జత చేసుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్‌ ఛేంజర్‌ సినిమాల రిలీజ్‌ టైమ్‌ లో ఈ ట్యాగ్‌ను స్క్రీన్‌ నేమ్‌ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక ఇదే దారిలో మరో యంగ్‌ హీరో  రామ్‌ పోతినేని కూడా ట్యాగ్‌ త్యాగం చేస్తున్నాడు. చాలా ల్యాంగ్‌ గ్యాప్‌ తర్వాత  ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవడంతో రామ్‌ పోతినేని కి ముందు ఉస్తాద్‌  అని ట్యాగ్‌ను తగిలించుకున్నాడు రామ్‌. ఆ తర్వాత చేసిన  ఇస్మార్ట్‌ శంకర్‌ 2 సహా పలు సినిమాలు  డిజాస్టర్స్‌ కావడంతో ఉస్తాద్‌ ట్యాగ్‌ కు గుడ్‌ బై చెప్పేస్తున్నాడట రామ్‌.  తన పాత  ఎనర్జిటిక్‌ స్టార్‌ ట్యాగ్‌ తో సరిపెట్టుకుంటున్నాడు.  రాబోతున్న ఆంధ్ర కింగ్‌ సినిమా పోస్టర్‌ లోను ఆ పాత ట్యాగ్‌తోనే వస్తున్నాడు.  

వేలం వెర్రి కాకూడదు
మరే భాషా చిత్ర పరిశ్రమలోనూ లేనంతగా టాలీవుడ్‌లో ఈ స్టార్‌ టైటిల్స్‌ చాలా కాలం పాటు హీరోలను ఎలివేట్‌ చేసే మార్కెటింగ్‌ సాధనాలుగా పనిచేశాయి. ఎన్టీయార్‌ తరంలో నట రత్న, నట సామ్రాట్, సూపర్‌స్టార్, రెబల్‌ స్టార్‌...ఆ తర్వాత అవి వారసత్వ సంపద తరహాలో అనివార్యంగా వారసులకు అంటగట్టేశారు. చిరంజీవి తరం వరకూ కూడా ఈ తరహా ట్యాగ్స్‌ బాగానే అనిపించాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకుల వరకూ మాత్రమే అవి పరిమితం కాబట్టి  వారు తమ హీరోలను దేవుళ్ల తరహాలో ఆరాధించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే అనిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ట్యాగ్స్‌ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తగిలించుకున్న ట్యాగ్‌కు తగ్గ స్ఠాయి లేకపోతే అన్య భాషా ప్రేక్షకుల దగ్గర నవ్వుల పాలు కామా?

ఉదాహరణకు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాను ఎప్పటి నుంచో గ్లోబల్‌ స్టార్‌గా మీడియా పేర్కొంటోంది. ఆమె అటు హాలీవుడ్, ఇటు ఇండియన్‌ సినిమా రెండింటిలోనూ రాణిస్తోంది కాబట్టి  అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఫలితం చూసి గ్లోబల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ను రామ్‌ చరణ్‌ జత చేసుకోవడం ఒక తొందరపాటే అని చెప్పాలి. వదులుకోవడం మంచి పరిణామమే అని కూడా చెప్పాలి.  

ఈ ఉదంతం నుంచి ఇకనైనా యువ హీరోలు పాఠం నేర్చుకోవాలి. తాము తగిలించుకునే  ట్యాగ్‌  అర్ధవంతంగా ఉన్నంతవరకూ ఓకే కానీ అతిశయోక్తిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మాత్రం ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌కు చేరువవుతున్న తెలుగు సినిమా స్థాయిని తెలుగు స్టార్స్‌ తమ కీర్తి కండూతితో దిగజార్చినట్టే అవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement